ఏపీలోని పాఠశాలలకు మే 6 నుంచి జులై 3 వరకు రాష్ట్ర ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. అయితే, వచ్చే నెల మే 20 తేదీ వరకు సెలవులను రద్దు చేస్తున్నట్లు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఎమర్జెన్సీ మాత్రమే సెలవులు పెట్టుకునేందుకు అనుమతిస్తున్నట్లు స్పష్టం చేసింది.
విద్యా శాఖ నిర్ణయాలపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందిస్తూ.. ఓ ప్రకటన విడుదల చేశారు. విద్యాశాఖ నిర్ణయంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఉపాధ్యాయులకు సెలవులు ఇవ్వకూడదన్న నిర్ణయాన్ని విద్యాశాఖ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. టీచర్లకు సెలవులు వేసవి కాలంలో కాకుండా వర్షాకాలంలో ఇస్తారా అంటూ సోము వీర్రాజు ఎద్దేవా చేశారు.
మే 7వ తేదీతో పరీక్షలు అయిపోతుండగా టీచర్లకు సెలవులు ఎందుకు ఇవ్వరని ఆయన ప్రశ్నించారు. పరీక్షల అనంతరం వాల్యుయేషన్ డ్యూటీలో ఉండే ఉపాధ్యాయులకు ఆర్జిత సెలవులు ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ విధంగా డొంక తిరుగుడుగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.