డబ్బులు కోసం ఎంత దారుణానికైనా ఒడిగడుతున్నారు జనం. మానవ సంబంధాలను కూడా పక్కన పెడుతున్నారు. కన్నవాళ్లను కూడా కర్కషంగా కడతేరుస్తున్నారు. తాజాగా డబ్బుల కోసం కన్న తండ్రినే హత్య చేశాడు ఓ కొడుకు. తండ్రిని హత్య చేయడమే కాకుండా.. ఆ మరణాన్ని ప్రమాదంగా చిత్రీకరించి కుటుంబ సభ్యులను బురిడీ కొట్టించాడు. కానీ తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వికారాబాద్ జిల్లాలోని బీక్య నాయక్ తండాలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొడంగల్ నియోజక వర్గంలోని బీక్యా నాయక్ తండాకు చెందిన రాఠోడ్ ధన్ సింగ్ కు ముగ్గురు కుమారులు ఉన్నారు. వారిలో పెద్ద కొండుకు జీవనోపాధి నిమిత్తం తాండూర్ వెళ్లి పనులు చేసుకుంటూ ఉండేవాడు. మిగిలిన ఇద్దరు రవి నాయక్, శ్రీనివాస్ నాయక్ లు తండ్రితో తండాలోనే ఉంటున్నారు. అయితే తండ్రికి 50 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ వస్తుందని తెలుసుకున్న రెండో కొడుకు రవి.. ఎలాగైనా సరే తండ్రిని చంపాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు తండ్రిని పక్కా ప్లాన్ ప్రకారం హతమార్చాడు.
అన్నయ్య దగ్గరికీ వెళ్దామని చెప్పి.. దారిమధ్యలో తండ్రి తలపై బండరాయితో బలంగా మోదాడు. వెంటనే ధన్ సింగ్ మరణించాడు. తండ్రిని సైలెంట్ గా చంపేసి.. ఎవ్వరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఉండేందుకు దాన్ని ప్రమాదంగా చిత్రీకరించాడు. 108కి ఫోన్ చేసి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడని నమ్మించి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయితే అప్పటికే ధన్ సింగ్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
కుటుంబ సభ్యులందరినీ నమ్మే విధంగా రకరకాల నాటకాలు వేశాడు. దీంతో పెద్దాయన ప్రమాదవశాత్తే మరణించాడని కుటుంబ సభ్యులు కూడా నమ్మారు. కానీ చిన్న కొడుకుకి మాత్రం నమ్మకం కలగలేదు. తండ్రి మరణంపై అనుమానం వచ్చింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
పోలీసులు రంగ ప్రవేశం చేసి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయగా.. రెండో కొడుకు బాగోతం బయట పడింది. అతన్ని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారణ చేయగా.. అసలు విషయం కక్కేశాడు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం తానే తండ్రిని హత్య చేసినట్లుగా ఒప్పుకున్నాడు. తన తండ్రి పేరు మీద ఓ ప్రైవేటు బీమా సంస్థలో రూ.50 లక్షలు ప్రమాద బీమా ఉందని.. దానికి తననే నామినీగా పెట్టాడని తెలిపాడు. డబ్బులు అత్యవసరమై తండ్రిని చంపినట్లు రవి అంగీకరించాడు. దీంతో రవిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేశారు పోలీసులు.