ఫిబ్రవరిలో ఇప్పటికే పోటీ తీవ్రంగా ఉంది. కుదిరితే 25వ తేదీకి భీమ్లానాయక్ వస్తుంది. అది రాకపోతే ఆడవాళ్లు మీకు జోహార్లు వస్తుంది. అంతకంటే ముందు రవితేజ హీరోగా నటించిన ఖిలాడీ వస్తోంది. వీటితో పాటు వాలిమై, గని లాంటి సినిమాలు కూడా ఫిబ్రవరికే షెడ్యూల్ అయి ఉన్నాయి. ఇప్పుడీ పోటీలోకి మోహన్ బాబు ఎంటరయ్యారు.
లాంగ్ గ్యాప్ తర్వాత మోహన్ బాబు లీడ్ రోల్ పోషించిన సినిమా సన్నాఫ్ ఇండియా. డైమండ్ రత్నబాబు డైరక్ట్ చేసిన ఈ సినిమాను 18వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించారు. దీంతో మోహన్ బాబు సినిమా కూడా బాక్సాఫీస్ రేసులోకి చేరినట్టయింది.
చాన్నాళ్ల తర్వాత మోహన్ బాబు నటించిన సినిమా కావడంతో సన్నాఫ్ ఇండియాపై ఓ మోస్తరు అంచనాలున్నాయి. దీనికితోడు మోహన్ బాబు స్వయంగా ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించడంతో ఆ అంచనాలు మరింత పెరిగాయి. కాకపోతే డైమండ్ రత్నబాబు డైరక్షన్ అంటేనే అందర్లో అనుమానాలు పెరుగుతున్నాయి.
దర్శకుడిగా తొలి ప్రయత్నంగా బుర్రకథ అనే సినిమా తీశాడు ఈ మాటల రచయిత. ఆది సాయికుమార్ హీరోగా నటించిన ఆ సినిమా డిజాస్టర్ అయింది. ఇప్పుడు తన రెండో ప్రయత్నంగా మోహన్ బాబుతో సన్నాఫ్ ఇండియా అనే సినిమా తీస్తున్నాడు. దర్శకుడి ట్రాక్ రికార్డ్ ను మినహాయిస్తే, సినిమాలో మోహన్ బాబు డైలాగ్స్ మాత్రం ఓ రేంజ్ లో ఉండబోతున్నాయి. పైగా మోహన్ బాబు ఈ సినిమాలో చాలా గెటప్స్ లో కనిపించబోతున్నారు.