చివరి రోజుల్లో తమకు ఆసరాగా ఉంటాడనుకున్న కొడుకు రాక్షసుడిగా మారాడు. కొడుకు పాటించాల్సిన కనీస ధర్మాన్ని మరచాడు. ఆస్తికోసం తల్లిదండ్రుల పాలిట రాక్షసుడయ్యాడు. ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లగొట్టాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం పెద్ద ఆదిరాల గ్రామంలో ఆలస్యంగా బయటపడింది. పెద్ద ఆదిరాల గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు బీరయ్య, తిర్మలమ్మకు ఇద్దరు కుమారులు.
వివాహాల అనంతరం ఇద్దరు కొడుకులు తల్లిదండ్రులను వదిలేసి వేరుగా ఉంటున్నారు. రెండేండ్ల కిందట ఇద్దరు కుమారులకు చెరో 5 ఎకరాల చొప్పున భూమిని పంచి ఇచ్చారు. మిగిలిన 8 ఎకరాల్లో వృద్ధ దంపతులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
అయితే చిన్న కుమారుడు మల్లేశ్ గతేడాదిగా మిగతా ఆస్తి కోసం తల్లిదండ్రులను వేధిస్తున్నాడు. రోజూ రాత్రి సమయంలో తాగొచ్చి ఆస్తి తన పేర చేయాలని బెదిరిస్తున్నాడు.
తల్లిదండ్రులు గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు.‘మేము బతికున్నంత వరకు వ్యవసాయం చేసుకొని జీవనం సాగిస్తాం. ఆ తర్వాత మీ పేర చేసుకోండి’ అంటూ తల్లిదండ్రులు సూచించారు.
అయినా మల్లేశ్‌లో మార్పు రాలేదు. ఆస్తి తన పేర చేసే వరకు ఇంట్లో ఉండొద్దని, వారం రోజుల కిందట ఇంటికి తాళం వేసి తమను బయటకు వెళ్లగొట్టాడని ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
కొట్టి చంపుతాడన్న భయంతో ఊరు వదిలి వివిధ గ్రామాల్లోని గుడుల్లో తలదాచుకుంటున్నామని వాపోయారు. కొడుకుతో ప్రాణహాని ఉన్నదంటూ జడ్చర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.