అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్-2’ సీక్వెల్‌గా ‘ఎఫ్-3’ మూవీ తెరకెక్కింది. విక్టరీ వెంకటేశ్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈ సినిమాతో సమ్మర్ సోగ్గాళ్ళుగా థియేటర్లలో నవ్వులు పంచడానికి మే 27న రాబోతున్నారు. ఇక వెంకటేశ్‌కు జోడీగా తమన్నా, వరుణ్ తేజ్‌కు జోడీగా మెహరీన్ సందడి చేయబోతున్నారు. మరో హీరోయిన్ సోనాల్ చౌహాన్ కీలక పాత్ర పోషించింది. తాజాగా ఎఫ్-3 సినిమాలో తన పాత్రకు సంబంధించిన పలు విశేషాలు మీడియాతో పంచుకుంది సోనాల్.
‘ఎఫ్-3’ ప్రాజెక్ట్‌లోకి రావడం వెనుక చాలా ఆసక్తికరమైన కథ ఉందని చెప్పింది సోనాల్. ‘లెజెండ్’ సినిమా జరుగుతున్నప్పుడే దర్శకుడు అనిల్ రావిపూడితో పరిచయమైందని తెలిపింది. ఆ సమయంలోనే కలసి వర్క్ చేయాలని అనుకున్నామని.. చాలా ఏళ్ల తర్వాత ఆయన నుండి ఫోన్ వచ్చిందని వివరించింది. ”ఎఫ్-3′ అనే సినిమా చేస్తున్నాను.. ఓ పాత్ర కోసం మిమ్మల్ని అనుకుంటున్నాను’ అన్నారని.. అయితే, కాల్ రాగానే కంగారు పడినట్లు చెప్పింది.
‘అనిల్ రావిపూడి కామెడీ కంటెంట్‌ను చాలా గొప్పగా తెరకెక్కిస్తారు. ఆయన నుంచి వచ్చిన ‘ఎఫ్ 2’ చూశాను. అందువలన ఆయన నుంచి కాల్ రాగానే కంగారు పడిపోయాను. ఎందుకంటే నేను అప్పటివరకూ కామెడీ చేయనేలేదు. ఈ సినిమాలో రొమాంటిక్ టచ్‌తో కూడిన కామెడీ రోల్ ఉందని ఆయన చెప్పగానే ఓకే అనేశాను. అయితే, నేను అంతవరకూ కామెడీ రోల్స్ చేయలేదనీ.. ఎలా ప్రిపేర్ కావాలో తెలియడం లేదని అనిల్ రావిపూడితో అన్నాను.. ‘మీరు అలాంటి టెన్షన్స్ పెట్టుకోకుండా సమయానికి షూటింగుకి వస్తే చాలు’ అని ఆయన అన్నారు. ఆయన చెప్పినట్టుగా కెమెరా ముందు చేస్తే చాలు అనే విషయం ఆ తరువాత నాకు అర్థమైంది’ అని సోనాల్ వివరించింది.
అలాగే, వెంకటేష్, వరణ్ తేజ్‌లతో పనిచేయటం చాలా ఆనందాన్ని ఇచ్చిందని చెప్పింది. తమన్నా, మెహ్రీన్‌లతో కలసి పని చేయడం వండర్ ఫుల్ ఎక్స్పీరియన్స్ అని, ఈ సినిమా తర్వాత తాము మంచి స్నేహితులయినట్లు తెలిపింది. ఇక సోనాల్ సినిమాల విషయానికి వస్తే.. నాగార్జునతో ది ఘోస్ట్ సినిమా చేస్తోంది. ఇందులో సోనాల్ ది యాక్షన్ రోల్.