1987 లో అనిల్ కపూర్, శ్రీదేవి నటించిన హిందీ ఫిల్మ్ ‘మిస్టర్ ఇండియా’ ను రీమేక్ చేస్తున్నారన్న వార్తలపై అనిల్ కపూర్ కుమార్తె, నటి సోనమ్ కపూర్ తీవ్రంగా స్పందించారు. ఫిల్మ్ మేకర్ అలీ అబ్బాస్ జాఫర్ సోషల్ మీడియాలో ప్రకటించే వరకు ఈ విషయం నాకు తెలియదన్నారు. ‘మిస్టర్ ఇండియా’ రీమేక్ కు సంబంధించి తన తండ్రి అనిల్ కపూర్ ను గానీ, డైరెక్టర్ శేఖర్ కపూర్ ను గానీ ఎవరూ సంప్రదించలేదని…ఇది చాలా అవమానకరమని సోనమ్ కపూర్ సోషల్ మీడియా ఇన్ స్టా గ్రామ్ లో తెలిపారు. ఇదే నిజమైతే వారిద్దరిని సంప్రదించాలన్న విషయం వారికి తెలియదా అని ప్రశ్నించారు.
ఇది చాలా బాధాకరం…ఆ సినిమాను మనసుపెట్టి, కష్టపడి నిర్మించారు. డబ్బుల కంటే కూడా ఈ సినిమా మా నాన్నకు చాలా సెంటిమెంట్. ఆయన వారసత్వ సంపదలో అది భాగం. బాక్సాఫీస్ లో బిగ్ వీకెండ్ లాగానే ఒకరి పనిని గౌరవించడం ముఖ్యమని నేను భావిస్తాను అని రాశారు సోనమ్ కపూర్.
దీనిపై మిస్టర్ ఇండియా డైరెక్టర్ శేఖర్ కపూర్ స్పందిస్తూ మిస్టర్ ఇండియాను రీమేక్ చేస్తున్నట్టు తనను ఎవరు అడగలేదు…చెప్పలేదని అన్నారు. ఆ టైటిల్ తో క్యాష్ చేసుకోవాలని చూస్తున్నట్టున్నారు. కానీ అనుమతి లేకుండా ఆ సినిమాలోని పాత్రలను మాత్రం ఉపయోగించుకోలేరని చెప్పారు.
గత వారం అలీ అబ్బాస్ జాఫర్ జీ స్టూడియోతో కలిసి మిస్టర్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నట్టు ట్విట్టర్ లో ప్రకటించారు. ప్రతి ఒక్కరిని ఆకర్శించిన చారిత్రాత్మక పాత్రను ముందుకు తీసుకెళ్తున్నందుకు మంచి రెస్పాన్స్ వస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ నడుస్తుందని..ఇప్పటి వరకు నటులెవరిని తీసుకోలేదన్నారు.
1987 లో అనిల్ కపూర్, శ్రీదేవి జంటగా నటించిన మిస్టర్ ఇండియా సినిమా ఇండియన్ టాప్ క్లాసికల్ మూవీస్ లో లిస్ట్ లో నిలించింది. విలన్ గా అమ్రిష్ పురి పాత్ర ప్రేక్షకులకు ఇప్పటికీ గుర్తుంటుంది. ఈ సినిమాలోని డైలాగ్స్, కోట్స్ ఈ జనరేషన్ కూడా వాడుతుంటారు. లక్ష్మీకాంత్ ప్యారేలాల్ సంగీతం అద్భుతం.