కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఆదివారం ఆస్పత్రిలో చేరారు. కొవిడ్ సంబంధ సమస్యలతో ఆమె ఆస్పత్రిలో చేరారని కాంగ్రెస్ పార్టీ వెల్లడించింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా తెలిపారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్టు ఆయన వెల్లడించారు.
‘కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో ఆదివారం ఉదయం అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. త్వరలోనే ఆమె కోలుకుని డిశ్చార్జ్ అవుతారు’ అని రణదీప్ సూర్జేవాల ట్వీట్ చేశారు.
సోనియా గాంధీ జూన్ 2న కరోనా బారినపడ్డారు. ఈ నేపథ్యంలో మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి ఈడీ ఎదుట విచారణకు హాజరు కావడానికి మరింత సమయం కావాలని ఈడీని ఆమె కోరారు. జూన్ 23న ఆమె విచారణకు హాజరు కావాల్సి ఉండగా తాజాగా ఆమె ఆస్పత్రిలో చేరారు.
సోనియాతో పాటు రాహుల్ గాంధీకి సైతం ఈడీ గతంలో నోటీసులు పంపింది. జూన్ 2న విచారణకు హాజరు కావాలని రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు పంపింది. దీంతో తాను విదేశీ పర్యటనలో ఉన్నానని, భారత్ వచ్చాక విచారణకు హాజరవుతానని, అందుకు అనుమతించాలని ఈడీని ఆయన కోరారు.