కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 29వ రోజుకు చేరుకుంది. ఈ యాత్రలో రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పాల్గొన్నారు. అనారోగ్య కారణాలతో విదేశాల్లో చికిత్స పొందిన ఆమె ఇటీవల కోలుకుని భారత్‌కు తిరిగి వచ్చారు.
భారత్ కు తిరిగి వచ్చిన తర్వాత తొలిసారిగా ఆమె యాత్రలో పాల్గొన్నారు. యాత్రలో ఆమెతో పాటు పలువురు మహిళా ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది ఇలా ఉంటే ఈ రోజు పాదయాత్రలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
యాత్ర చేస్తుండగా సోనియా గాంధీ షూ లేస్ ఊడిపోయాయి. ఇది గమనించిన రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీకి షూ లేస్ కట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా వుంటే సోనియా రాకతో కాంగ్రెస్ శ్రేణుల్లో మరింత జోష్ పెరిగింది.
కర్ణాటకలో పాదయాత్ర చేసేందుకు సోనియాగాంధీ రావడం తమకు గర్వకారణమని ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ వెల్లడించారు. ఈ దసరా తర్వాత కర్ణాటకలో తమ పార్టీ విజయం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.