కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ మరోసారి ఈడీ ముందు హాజరయ్యారు. ఆమె వెంట ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఉన్నారు. భారీ బందోబస్తు మధ్య సోనియా ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. నగదు అక్రమ చలామణికి సంబంధించిన కేసులో ఈడీ సోనియాను ప్రశ్నించడం ఇది రెండోసారి.
ఈనెల 21న జరిగిన విచారణలో సుమారు 25 ప్రశ్నలు వేశారు అధికారులు. అయితే.. సోనియా విజ్ఞప్తి మేరకు ఆరోజు విచారణను రెండు గంటల్లోనే ముగించారు. ఇప్పుడు ఎన్ని గంటలు అనేది స్పష్టత లేదు. సోనియాను మరిన్ని ప్రశ్నలు అడిగే ఛాన్స్ ఉంది.
మరోవైపు కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. కాంగ్రెస్ పై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆ పార్టీ నాయకులు నిరసనలు చేస్తున్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్ కార్యాలయం దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రాజ్ ఘాట్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టేందుకు ఢిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు.
నేషనల్ హెరాల్డ్ పత్రికకు సంబంధించి కుట్ర పన్నారని సుబ్రహ్మణ్యస్వామి గతంలో కేసు పెట్టారు. సోనియా, రాహుల్ సహా ఏడుగురిపై ఢిల్లీలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేవలం రూ.50 లక్షల చెల్లింపుతో హక్కు పొందేందుకు ప్రయత్నించారనేది ఆయన ఆరోపణ. కేసు విచారణలో భాగంగా ఇటీవలే కాంగ్రెస్ నేతలు రాహుల్ గాందీ, మల్లికార్జున్ ఖర్గే, పవన్ బన్సల్ ను ఈడీ ప్రశ్నించింది. ఇప్పుడు సోనియాను ప్రశ్నిస్తోంది.