కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికలను ఈ రోజు నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం సీనియర్ నేతలు శశిథరూర్, మల్లికార్జున్ ఖర్గే పోటీ పడుతున్నారు. ఎన్నికల సందర్భంగా ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలు ఓటు వేశారు.
మల్లిఖార్జున్ ఖర్గే బెంగుళూరులోని కాంగ్రెస్ కార్యాలయంలో ఓటు వేశారు. పలు రాష్ట్రాల కాంగ్రెస్ కార్యాలయాల్లోనూ ఓటింగ్ ప్రక్రియ జరుగుతోంది. ఇది కాంగ్రెస్ పార్టీకి చారిత్రాత్మక దినమని కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో మొత్తం 490 మంది నేతలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నట్టు శివకుమార్ వెల్లడించారు. ఎన్నికలు పారదర్శకంగా జరుగుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. మరోవైపు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సైతం స్పందించారు.
కాంగ్రెస్ పార్టీలో సుమారు 22 ఏండ్ల తర్వాత అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. పార్టీలో ఎలాంటి అంతర్గత విబేధాలు లేవని ఈ ఎన్నికల ద్వారా స్పష్టమవుతోందన్నారు. ఓట్ల లెక్కింపు అనంతరం కూడా గాంధీ కుటుంబంతో తన అనుబంధం యథావిధిగా కొనసాగుతుందన్నారు.