కరోనా వైరస్ ను కట్టడి చేయడంలో పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్ ల సమర్ధతలను ప్రభుత్వం వినియోగించుకోవడం లేదని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. గత కొన్ని నెలలుగా ఈ వైరస్ విదేశాల్లో ఎంతో మందిని బలిగొందని అన్నారు.
‘‘ వైరస్ నియంత్రణలో ముఖ్యమైంది శాంపిల్స్ పరీక్ష..130 కోట్ల జనాభా కలిగిన దేశంలో ఇప్పటి వరకు 15,701 శాంపిల్స్ మాత్రమే పరీక్షించారు. కీలకమైన సమయంలో, ముందస్తు హెచ్చరికలు ఉన్నప్పటికీ, ఇతర దేశాల అనుభవాలున్నప్పటికీ పబ్లిక్, ప్రైవేట్ సెక్టార్ల సమర్ధతను వినియోగించుకోలేకపోతున్నట్టు కనిపిస్తుంది…ఈ పద్ధతి మారాలి…అన్ని కేసులకు టెస్ట్ లు నిర్వహించాలి. కరనా పాజిటివ్ తేలిన వారితో దగ్గరగా తిరిగిన వారిని గుర్తించి వారికి కూడా టెస్ట్ లు చేయాలి‘‘ అని సోనియా గాంధీ పత్రికా ప్రకటనలో కోరారు.
వైరస్ ప్రభావంతో అన్ని రంగాలు ఆర్ధికంగా ఇబ్బందుల నెదుర్కొంటున్నాయని..ఆయా రంగాల వారీగా ప్రభుత్వం సమగ్రంగా రిలీఫ్ ప్యాకేజ్ ను అందజేయాలని సోనియాగాంధీ ప్రభుత్వాన్ని కోరారు. దేశ ప్రజలందరూ ఇళ్లకే పరిమితం కావాలని పిలుపునిచ్చారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని…వ్రద్ధులు, పిల్లలు పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని…ఇళ్లకే పరిమితం కావడం వల్ల వైరస్ వ్యాప్తి చెందకుండా నియంత్రించవచ్చని సోనియా గాంధీ అన్నారు.
తాజా లెక్కల ప్రకారం శనివారం సాయంత్రం 6 గంటల వరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 283 కు పెరిగినట్టు కేంద్ర హోం మంత్రిత్వ వెబ్ సైట్ లో తెలిపింది.