కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి కరోనా పాజిటివ్ గా తేలింది. తేలికపాటి జ్వరంతో బాధపడుతున్నారని, కరోనా లక్షణాలు స్వల్పంగా కనిపించాయి. ఈ విషయాన్ని పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా తెలిపారు.
కరోనా పాజిటివ్ గా తేలడంతో ఆమె ఐసోలేషన్ కు వెళ్లిపోయారని, డాక్టర్లు ఆమెకు వైద్యం అందజేస్తున్నారని ఆయన వెల్లడించారు. గత కొన్ని రోజులుగా పలువురు కార్యకర్తలు, నేతలను ఆమె కలుస్తున్నారని వివరించారు. వారిలో కొందరికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు చెప్పారు.
ఇక ఈ నెల 8న జరిగే ఈడీ విచారణకు ఆమె హాజరవుతారని ఆయన స్పష్టం చేశారు. ఆమె త్వరలోనే కోలుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈడీ విచారణకు హాజరయ్యే విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి మార్పులు జరగలేదన్నారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణకు గురువారం హాజరుకావాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఈడీ నోటీసులు పంపింది. అయితే ముందుగానే అనుకున్న షెడ్యూల్ ప్రకారం రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లారని కాంగ్రెస్ తెలిపింది. అందువల్ల విచారణకు ప్రస్తుతం హాజరు కాలేరని, మరింత సమమం ఇవ్వాలని ఈడీని కాంగ్రెస్ కోరింది.