భారత్ జోడో యాత్రలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈ రోజు ఉదయం పాల్గొన్నారు. కర్ణాటకలోని మాండ్యలో రాహుల్ గాంధీతో కలిసి ఆమె పాదయాత్ర చేస్తున్నారు. బీజేపీ పాలిత ప్రాంతమైన కర్ణాటకలో ఆమె యాత్రలో పాల్గోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆమె కొన్ని రోజులుగా అనారోగ్య కారణాలతో బాధపడుతున్నారు. అందువల్ల భారత్ జోడో యాత్ర ప్రారంభంలో ఆమె పాల్గోలేకపోయారు. చికిత్స పూర్తిచేసుకుని విదేశాల నుంచి భారత్ కు ఇటీవల ఆమె తిరిగి వచ్చారు.
భారత్ కు తిరిగి వచ్చాక ఆమె ఈరోజు తొలిసారిగా పాదయాత్రలో పాల్గొన్నారు. బళ్లారిలో నిర్వహించే ర్యాలీలో కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. విజయదశమి సందర్భంగా భారత్ జోడో యాత్రకు రెండు రోజుల విరామం ఇచ్చారు.
తాజాగా గురువారం యాత్రను తిరిగి ప్రారంభించారు. పాదయాత్రలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీతో పాటు స్థానిక మహిళా ఎమ్మెల్యే అంజలి నింబార్కర్, రూపకళ, లక్ష్మీ హెబ్బాల్కర్, ఇతర మహిళా నాయకులు పాల్గొన్నారు.