పౌరసత్వ చట్టం- తదనంతరం దేశంలో నెలకొన్ని పరిస్థితిపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ నేతృత్వంలో విపక్షాల ప్రతినిధి బృందం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసింది. వివాదాస్పద పౌరసత్వ చట్టాన్ని ఉపసంహరించాలని ప్రతినిధి బృందం రాష్ట్రపతిని కోరింది.
రాష్ట్రపతిని కలిసి వచ్చిన తర్వాత సోనియాగాంధీ మీడియాతో మాట్లాడారు. జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ వద్ద ఆదివారంనాడు శాంతియుతంగా చేపట్టిన ప్రదర్శనపై ఢిల్లీ పోలీసులు వ్యవహరించిన తీరు ఆవేదన కలిగిస్తోందని అన్నారు. పౌరసత్వ చట్టం కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లోని పరిస్థితి ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించిందని… ఇది చాలా తీవ్రమైన పరిస్థితి అన్నారు. ఈ అల్లర్లు మరిన్ని ప్రాంతాలకు కూడా విస్తరించే అవకాశాలపై తాము ఆందోళన చెందుతున్నామన్నారు. ఢిల్లీలో జరిగిన ఘటనే దీనికి ఉదాహరణ అన్నారు. జామియా యూనివర్సిటీ హాస్టల్‌ల్లోకి ఢిల్లీ పోలీసులు ప్రవేశించి వారిని బయటకు ఈడ్చారు, ఎలాంటి దయాదాక్షిణ్యాలు లేకుండా విద్యార్థులను కొట్టారు. ప్రజలు తమ నిరసనను తెలియజేయకుండా చేసి చట్టాన్ని అమలు చేసిన తీరు చూస్తే మోదీ ప్రభుత్వానికి కనికరం లేదనే విషయం అర్ధమవుతుందన్నారు.