నేషనల్ హెరాల్డ్ మనీల్యాండరింగ్ కేసులో ఈడీ విచారణకు కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ హాజరయ్యారు. వరుసగా మూడో రోజు కూడా ఈడీ అధికారులు ఆమెను విచారించారు.
ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత భోజన విరామం సమయంలో ఆమె ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు. అయితే ఈ కేసులో సోనియాకు ఈడీ మరోసారి సమన్లను జారీ చేయలేదు.
అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని సోనియాకు ఈడీ అధికారులు తెలిపారు. సోనియాను ఈడీ అధికారులు సుమారు ఆరు గంటల పాటు విచారించారు.
ఈడీ విచారణను నిరసిస్తూ కాంగ్రెస్ కార్యకర్తలు ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. విజయ్ చౌక్ వద్ద ప్రశాంతంగా నిరసనలు తెలుపుతున్న 65 మంది ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు కాంగ్రెస్ ఎంపీ మణికమ్ ఠాగూర్ వెల్లడించారు.
తమను పోలీసులు బలవంతంగా లాక్కెళ్లుతున్నట్లు సచిన్ పైలట్ ఆరోపించారు. మరోవైపు పార్లమెంట్ నుంచి నిరసన ర్యాలీని కాంగ్రెస్ ఎంపీలు తీశారు.
సోనియాను బుధవారం మూడు గంటల పాటు ఈడీ అధికారులు విచారించారు. ఇదే కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా ఈడీ విచారణను ఎదుర్కొన్నారు. రాహుల్‌ను 5 రోజుల పాటు విచారించిన ఈడీ అధికారులు సుమారు 150 ప్రశ్నలు వేశారు.