కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో తనకు అధినేత్రి సోనియాగాంధీ మద్దతిస్తున్నారంటూ వస్తున్న వార్తలను ఆ పార్టీ అభ్యర్థి, సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే తోసిపుచ్చారు. కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థిగా తన పేరును అధినేత్రి సోనియా గాంధీ ఎప్పుడూ సూచించలేదని పేర్కొన్నారు.
అవన్నీ కేవలం వదంతులేనని ఆయన పేర్కొన్నారు. గాంధీ కుటుంబానికి చెందిన వారు ఎవరూ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయరని, ఏ అభ్యర్థికి మద్దతు ఇవ్వరని అధినేత్రి సోనియా గాంధీ ఇదివరకే స్పష్టం చేశారని ఆయన చెప్పారు.
తనను, అధినేత్రి సోనియాగాంధీని, కాంగ్రెస్ పార్టీని అప్రతిష్ట పాలు చేసేందుకే కొందరు ఇలాంటి వదంతులు వ్యాప్తి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. పార్టీ సభ్యులు 9300 మంది ప్రతినిధులను ఎన్నుకున్నారని ఆయన అన్నారు.
ఆ ప్రతినిధులు అభ్యర్థికి ఓటు వేస్తారని, మెజారిటీ ఓట్లు పొందిన వ్యక్తిని అధ్యక్షునిగా నియమిస్తారని ఆయన వెల్లడించారు. తనకున్న అవకాశాల కోసం తాను ఇక్కడకు రాలేదన్నారు. తననుు పోటీ చేయాలని కోరిన కార్యకర్తలే తన గెలుపునకు బాధ్యత వహిస్తారని చెప్పారు.