కాంగ్రెస్‌లో నాయకత్వ లోపాలపై అంతృప్తి వ్యక్తం చేస్తూ, మార్పు కోరుతూ ఆ పార్టీ అధినేత సోనియాగాంధీకి లేఖ రాసిన అసమ్మతి నేతలను చల్లబరిచే ప్రయత్నాలకు దిగింది అధిష్టానం. ఈ మేరకు సోనియాకు లేఖ రాసిన నేతలు రేపు ఆమెతో భేటీ కానున్నారు. లేఖ రాసేందుకు దారి తీసిన పరిస్థితులు, నాయకత్వంలో తాము కోరుకుంటున్న మార్పులను స్వయంగా ఆమెకే తెలియజెప్పనున్నారు. ఈ సమావేశానికి మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్‌నాథ్ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్నట్టుగా తెలిసింది.
కాంగ్రెస్ నాయకత్వంతో పాటు సంస్థాగతంగా ప్రక్షాళన అవసరం అంటూ గత ఆగస్టులో సోనియా గాంధీకి 23 మంది సీనియర్ నేతలు ఉమ్మడిగా ఓ లేఖ రాశారు. ఇందులో గులాంనబీ ఆజాద్, కపిల్ సిబాల్‌ల వంటి నేతలు కూడా సంతకాలు చేశారు. వారి తీరుపై పార్టీలో విమర్శలు వచ్చాయి. ఒక దశలో రాజీనామా వరకు వెళ్లాయి.
ఇదిలా ఉంటే సోనియాతో భేటీకి లేఖలో సంతకం చేసిన అసంతృప్తి నేతలంతా సమావేశం అవుతారా లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. అందరి తరపున ఐదు లేదా అరుగురు పాల్గొంటారని తెలుస్తోంది. ఈ సమావేశంలో రాహుల్‌గాంధీ, ఇతర ముఖ్య నేతలు పాల్గొనే విషయంపైనా ఇంకా స్పష్టత రాలేదు.