కాంగ్రెస్ విందు.. అతిధులు ఎవరంటే..

సార్వత్రిక ఎన్నికలకు మరో ఏడాది సమయం వుండడంతో కాంగ్రెస్ పార్టీ చకచకా పావులు కదుపుతోంది. ఎన్డీఏ నుంచి శివసేన, టీడీపీలు దూరమయ్యాయి. ఇదేక్రమంలో తలోవైపు చెదిరిపోయిన పాత మిత్రులందర్నీ ఒకే తాటిమీదకు తెచ్చే ప్రయత్నం చేస్తోంది. ఇందులోభాగంగా మంగళవారం రాత్రి ఢిల్లీలోని 10 జన్‌పథ్‌లోని సోనియాగాంధీ తన నివాసంలో రాజకీయ విందు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి 19 పార్టీల ముఖ్యనేతలు హాజరయ్యారు.

మాజీ పీఎం మన్మోహన్‌సింగ్, రాహుల్‌గాంధీ, సీపీఐ నేత రాజా, శరద్‌పవర్, ఒమర్ అబ్దుల్లా, కనిమొళి, తేజశ్వీయాదవ్ వంటి నేతలు కూడా ఈ విందుకు హాజరయ్యారు. ఈ విందుని రాజకీయ కోణంలో చూడొద్దని, స్నేహం, పరస్పరం సంబంధాలను పెంపొందించుకునే ఉద్దేశంతోనే ప్రతిపక్ష పార్టీలను ఆహ్వానించామని అన్నారు కాంగ్రెస్ నేత రణదీప్ సింగ్ సుర్జేవాలా.

ఈ విందులో ఎలాంటి ప్రసంగాలు లేకుండా స్నేహపూర్వక వాతావరణంలో సాగడం మరో విశేషం. సోనియాగాంధీ అద్భుతమైన విందు ఏర్పాటు చేయడం, వివిధ పార్టీల నేతలంతా ఒక్క చోటే కలుసుకోడానికి ఇదో చక్కని అవకాశమన్నారు రాహుల్. రాజకీయంగా చర్చ చాలానే జరిగిందికానీ, పార్టీల మధ్య సఖ్యత దీని ముఖ్యఉద్దేశమని ట్వీట్ చేశారు రాహుల్ గాంధీ.