లాక్‌డౌన్, కరోనా కాలంలో ఆపద్బాంధావుడిగా నిలిచిన ప్రముఖ నటుడు సోనూసూద్ చిక్కుల్లో పడ్డారు. సోనూసూద్, ఆయన సహచరులు కలిసి రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ సంచలన ప్రకటన చేసింది. నాలుగు రోజులుగా ఆయన ఇళ్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహిస్తూ వస్తున్న ఐటీ అధికారులు.. ఆయన ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు. ఈ మేరకు తాజాగా రూ. 20 కోట్ల పన్నును సోనూసూద్ ఎగవేసినట్టుగా వెల్లడించారు.
బోగస్ లోన్ల పేరుతో సోనూసూద్, ఆయన అనుచరులు కలిసి ఆస్తులను కొనుగోలు చేశారని ఐటీ డిపార్ట్‌మెంట్ చెబుతోంది. మరోవైపు విరాళల సేకరణలో.. విదేశీ విరాళాల చట్టాన్ని కూడా సోనూసూద్ అక్రమించారని ఆరోపిస్తోంది. సోనూసూద్ నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ.. రూ.18 కోట్లకు పైగా విరాళాలను సేకరించిందని, అందులో రూ.1.9 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టగా.. మిగిలిన సొమ్ము ఆ ఖాతాల్లోనే ఉందని తెలిపింది. ఇదిలా ఉంటే.. సోనూసూద్‌పై ఐటీ దాడులు కక్షసాధింపు చర్యలేనని ఆరోపిస్తున్నాయి ఆమ్ ఆద్మీ, శివసేనలాంటి పార్టీలు.