సినీ నటుడు సోనూసూద్ రాజకీయాల్లోకి వస్తారంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలపై ఆయన స్పందించారు. తాను ఇప్పట్లో రాజకీయాల్లోకి రాబోనని చెప్పారు. అలాంటి ఆలోచన తనకు లేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. ప్రాణం ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు.
ప్రతి రాష్ట్రంలో వృద్ధాశ్రమం, ఉచిత పాఠశాలను ఏర్పాటు చేయడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ది పార్క్ హోటల్‌లో ఫిక్కీ లేడీస్ ఆర్గనైజేషన్ నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
ఫిక్కీ ఛైర్‌పర్సన్ శుభ్రా మహేశ్వరి అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. తన భార్య తెలుగు మహిళ అని చెప్పారు. తాను చేస్తున్న సేవలకు ఆమె కుటుంబం నుంచి పూర్తి మద్దతు లభిస్తోందని ఆయన వెల్లడించారు. ఇప్పటి వరకు ఏడున్నర లక్షల మందికి సాయం చేసినట్టు తెలిపారు.
వారిలో 95 శాతం మందిని తాను చూడలేదని ఆయన అన్నారు. ఇబ్బందుల్లో ఉన్న వారి సమస్యలు తెలుసుకుని, వారికి ఎవరు సాయం చేయగలరో వారిని నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకొని తాను ముందుకు వెళుతున్నట్టు చెప్పారు. అందువల్లే తాను ఈ సేవలు చేయగలిగామని వివరించారు.