సిద్దిపేట జిల్లాలో నటుడు సోనుసూద్ పర్యటించారు. చేర్యాల, మద్దూర్ మండలంలో ఆయనకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. కరోనా లాక్‌డౌన్ సమయంలో ప్రజలకు సోనుసూద్ సేవలు చేశారు. ఆయన సేవలకు గుర్తింపుగా మద్దూర్ మండలం చెల్మి తండా ప్రజలు ఆయనకు ఆలయాన్ని నిర్మించారు.
రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రజలకు ఆయన సహాయం చేశారు. దీంతో ఆయనపై తండా వాసులు, గ్రామస్తులు, యువకులు అభిమానాన్ని పెంచుకున్నారు. ఈ క్రమంలో సోనుసూద్‌ను దేవుడిలాగా భావించి ఆయనకు గుడి కట్టారు. అభిమానుల పిలుపు మేరకు ఆయన చెల్మి తండాకు వెళ్లారు.
అంతకుముందు ఆయన చేర్యాల పట్టణానికి చేరుకోగా ప్రజలు అభిమానులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఆయనతో సెల్పీలు దిగేందుకు అభిమానులు పోటీపడ్డారు. అనంతరం నిర్వహించిన బైక్ ర్యాలీలో సోనుసూద్ తో పాటు పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు.
బైక్ ర్యాలీలో పాల్గొన్న ఆయన తన అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. రోడ్డు వెంట ఉన్న గ్రామస్తులు నినాదాలతో హోరెత్తించారు. హీరో… హీరో అంటూ కొందరు అభిమానులు నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. వారి అభిమానాన్ని చూసి సోనుసూద్ సంతోషం వ్యక్తం చేశారు.