రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నిర్మల గ్రామానికి చెందిన అన్నదాతలు మంత్రి కేటీఆర్ పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఫుడ్ పార్క్ పేరు మీద కేటీఆర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల ప్రజల నుండి బలవంతంగా తీసుకున్న 370 ఎకరాల భూమికి సంబంధించి వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
అయితే భూములు ఇవ్వమని చెప్పినా.. బలవంతంగా ఎమ్మార్వో, ఆర్డీవో భయభ్రాంతులకు గురి చేశారని.. దాని కోసం తాము నమ్ముకొని బతుకుతున్న భూమిని ఇష్టం లేకపోయినా.. పూడ్ పార్క్ కోసం ఇవ్వడం జరిగిందని రైతులు వాపోయారు. అయితే బలవంతంగా భూమి లాక్కున్న వాళ్లు మమ్మల్ని నడిరోడ్డున వదిలేశారని.. అప్పటి నుంచి ఇప్పటి వరకు నష్టపరిహారాన్ని ఇవ్వలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మా సమస్యలు ఎమ్మార్వోకి, ఆర్డీవోకి చెప్పినా.. కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసినా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదని ఆవేదన చెందుతున్నారు. అయితే 2013 ల్యాండ్ యాక్టివేషన్ యాక్ట్ ప్రకారం, భూమి కోల్పోయిన ప్రతి బాధితునికి ఎకరానికి 23 లక్షల రూపాయలు కట్టివ్వాలని..ప్రతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వోద్యోగం కల్పించాలని అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.
అదే విధంగా 105 సర్వే నెంబర్ల చెట్ల పైసలు మరియు ఎంకరేజ్మెంట్ ల్యాండ్ కు సంబంధించిన పైసలు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వలేదని.. భూమి కోల్పోయిన ప్రతి బాధితునికి రెండు గంటల భూమి ఇవ్వాలని వాళ్లు డిమాండ్ చేశారు. లేని పక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని.. చివరికి ప్రగతి భవన్ ముట్టడించడానికి కూడా వెనకాడమని, మంత్రి కేటీఆర్ ని హెచ్చరిస్తున్నట్టు రైతులు చెప్పారు.