– తుమ్మలతో హరీష్ రావు మంతనాలు
– బహిరంగ సభకు ఆహ్వానం
– ఇదంతా పొంగులేటిని చెక్ పెట్టడానికేనా?
– తుమ్మలకు ఇచ్చిన హామీ ఏంటి..?
– రాజకీయ వర్గాలో మొదలైన చర్చ
తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభను ఎలాగైనా సూపర్ సక్సెస్ చేయాలని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మంత్రి హరీశ్ రావ్ తుమ్మల నాగేశ్వర్ రావ్ ఇంటికెళ్లి కలవడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.
ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాట్ల పర్యవేక్షణకు వచ్చిన మంత్రి హరీశ్ రావ్ మంత్రి అజయ్, ఎంపీలు నామ,రవిచంద్రతో కలిసి గండుగులపల్లిలోని తుమ్మల ఇంటికెళ్ళి అక్కడే భోజనం చేశారు. ఈనెల 18న ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభకు హాజరుకావాలని, హరీశ్ రావ్ ఆయన్ని ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలిసింది. తుమ్మలతో ఏకాంతంగా హరీశ్ రావ్ సమావేశమై.. పలు కీలక రాజకీయ అంశాలపై చర్చ జరిపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వచ్చినట్లు తుమ్మలకు హరీశ్ చెప్పినట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వారం వ్యవధిలో సీఎం కేసీఆర్ రెండు పర్యటనలు, ఈ నెల 18న ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభకు హాజరుకావాలని తుమ్మలను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలిసింది. బహిరంగ సభ విజయవంతానికి పనిచేయాలని కోరినట్లు సమాచారం. కొత్తగూడెం, ఖమ్మం జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ల ప్రారంభోత్సవానికి హాజరుకావాలని కోరినట్లు తెలిసింది.
అయితే జిల్లాలో కీలకనేతగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పార్టీపై ధిక్కార స్వరం వినిపిస్తున్న సమయంలో తాజా పరిణామాలపైనా ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. రానున్న రోజుల్లో తుమ్మలకు సముచిత స్థానం కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీగా హరీశ్ రావు తుమ్మలకు చెప్పినట్ల చర్చ జరుగుతోంది. మొత్తానికి హరీశ్ రావ్ తుమ్మల ఇంటికి వెళ్లడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.