ఎగ్జామ్స్ టైం విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేస్తోంది. చదువు పై శ్రద్ధ పెట్టలేకపోతున్నామని, కాలేజ్ యాజమాన్యల ఒత్తిడి, పేరెంట్స్ ప్రెషర్ ఇలా వివిధ కారణాలకు తోడుగా బ్యాక్ లాగ్స్ క్లియర్ చేయలేకపోతున్న స్టూడెంట్స్.. డీప్ డిప్రెషన్ లో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
తాజాగా చదువు పై శ్రద్ధ పెట్టలేక పోతున్నాను.. సారీ మమ్మీ, సారీ డాడీ.. నన్ను క్షమించండి.. అంటూ సూసైడ్ నోట్ రాసి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న ఓ స్టూడెంట్ సూసైడ్ చేసుకోవడం కలకలాన్ని రేపుతోంది. ఇక డీటైల్స్ లోకి వెళితే.. నల్గొండ జిల్లా దేవరకొండ మండలం మల్లేపల్లి గ్రామానికి చెందిన దంతోజు వెంకటేశ్వర్లు..భార్య,ముగ్గురు పిల్లలతో కలిసి బాలానగర్ లో నివాసముంటున్నాడు.
చిన్న కొడుకు దంతోజు శివప్రసాద్ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. మొదటి సంవత్సరంలో ఒక సబ్జెక్ట్ లో ఫెయిలయ్యాడు. సెకండ్ ఇయర్ పరీక్షలు సమీపిస్తుండడంతో ఫెయిల్ అవుతానేమోనని ఆందోళనకు గురయ్యాడు. తల్లిదండ్రులు అతడికి సర్దిచెబుతూ కాలేజీకి పంపించేవారు.
ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం కాలేజీ నుంచి ఇంటికి వచ్చిన శివప్రసాద్ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో లోపలి నుంచి గడియ పెట్టుకొని సూసైడ్ నోట్ ను రాసి సీలింగ్ ఫ్యాన్ కు ఉరివేసుకున్నాడు. ఇంటికి వచ్చిన తల్లి పద్మ, కుమార్తెతో కలిసి తలుపు తట్టినా తీయక పోవడంతో పక్కవారి సాయంతో తీయించి లోనికి వెళ్లగా శివప్రసాద్ విగతజీవిగా కనిపించాడు.
ఎన్నో ఆశలతో అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకు శవంగా కనిపించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తల్లి పద్మ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు బాలానగర్ ఎస్ ఐ తెలిపారు.