హైదరాబాద్ లోని జగద్గిరి గుట్ట పోలీసు స్టేషన్ పరిధిలో ఏకంగా ఎస్ఓటీ పోలీసులపైనే కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు మాధాపూర్ ఎస్ఓటీ కానిస్టేబుళ్లు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో ఒక్కసారిగా నివ్వెరపోయిన పోలీస్ట్ డిపార్ట్ మెంట్ ఉన్నతాధికారులు ఈ దాడి వెనుకున్న వాస్తవాలను తెలుసుకునే పనిలో పడ్డారు.
ఇక వివరాల్లోకి వెళితే.. ఓ కేసు విచారణ నిమిత్తం మాధాపూర్ పోలీసు స్టేషన్ కు చెందిన ఎస్ఓటీ కానిస్టేబుల్ రాజుతో పాటు మరో కానిస్టేబుల్ జగద్గిరి గుట్టలోని సిక్కుల బస్తీకి వెళ్లారు. అయితే కానిస్టేబుల్ రాజు పై ఒక్కసారిగా అదే బస్తీకి చెందిన సర్దార్ కరణ్ సింగ్ అనే సిక్క్ యువకుడు తల్వార్ తో దాడికి తెగబడ్డాడు. అదే విధంగా మరో కానిస్టేబుల్ పై కూడా దాడి చేశాడు.
ఈ ఘటనలో.. సిక్క్ యువకుడు కరణ్ సింగ్ కానిస్టేబుల్ రాజు ఛాతీలోకి తల్వార్ ను గుచ్చడంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. మరో కానిస్టేబుల్ తలపై దాడి చేయడంతో అతనికి కూడా తీవ్రగాయాలయ్యాయి. దీంతో వీరిద్దరిని కూకట్ పల్లిలోని రాందేవ్ బాబా ఆసుపత్రిలో చికిత్స అందించడం జరుగుతుంది. తీవ్రగాయాలైనప్పటికి వారిద్దరి పరిస్థితి కాస్త నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు.
అయితే సమాచారం అందుకున్న అడిషనల్ డీసీపీ రవికుమార్ తో పాటు ఎస్.ఓ.టి అడిషనల్ డీసీపీ నారాయణగౌడ్ ఆసుపత్రికి చేరుకొని వివరాలను తెలుసుకున్నారు. ఇక దాడికి గల కారణాల పై దర్యాప్తు చేపట్టారు పోలీసులు.