అబుదాబిలోని అంతర్జాతీయ విమానాశ్రయంపై నాలుగురోజుల క్రితం దాడి చేసిన హౌతీ తిరుగుబాటు దారులు భారీ మూల్యం చెల్లించుకున్నారు. యెమెన్‌లోని హౌతీ తిరుగుబాటుదారుల స్థావరాలపై సౌదీ అరేబియా దళాలు ఒక్కసారిగా దాడి చేశాయి. ఈ వైమానిక దాడుల్లో 100 మంది ప్రాణాలు కోల్పోగా.. 200 మందికి పైగా గాయపడ్డారని హౌతీ అధికారులు తెలిపారు.
దీనికి సంబంధించిన వీడియోని కూడా హౌతీలు విడుదల చేశారు. శిథిల భవనాలు, సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బంది ఈ వీడియోలో కనిపిస్తారు. జైలుపై జరిగిన వైమానిక దాడిలో 70 మంది ఖైదీలు చనిపోయారని హౌతీ తిరుగుబాటు ప్రభుత్వ ఆరోగ్య మంత్రి తహా అల్ మోటావకేల్ చెప్పారు.
చాలా మందికి తీవ్రగాయాలు అయ్యాయని.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా లేకపోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో పాటు.. దక్షిణ యెమెన్‌లోని హోదాయ్‌పై కూడా సౌదీ నాయకత్వంలోని సంకీర్ణ దళాలు వైమానిక దాడులు చేశాయి. దీనికి సంబంధించిన వీడియో కూడా విడుదల చేశారు.
Advertisements
ఈ దాడిలో హౌతీకి చెందిన టెలీకమ్యూనికేషన్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసం అయినట్టు తెలుస్తోంది. దీంతో యెమెన్ వ్యాప్తంగా 12 గంటలపాటు ఇంటర్నెట్ సేవలు బంద్ అయ్యాయని సమాచారం. ఈ ఘటనతో ప్రపంచదేశాలు అలెర్ట్ అయ్యాయి.