సౌందర్య..పేరుకు తగ్గ రూపం. ప్రేక్షకులను కట్టిపడేసే అభినయం. అంతే కాదు ఆమె తెలుగులో నటిస్తే తెలుగింటి అమ్మాయి, తమిళ్ లో నటిస్తే తమిళ పొన్ను. మళయాళంలో నటిస్తే మళయాళ పెన్ కుట్టి.కన్నడలో నటిస్తే..కన్నడ హుడుగి. అందుకే తెలుగులో పాటు ఇతర భాషల్లో వందకు పైగా సినిమాలలో నటించింది. ఏ భాషలో నటించినా ఉత్తమనటిగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది.
హీరోయిన్ అంటే ఆరు డ్యూయెట్లకు…నాలుగు రొమాంటిక్ సీన్లకు మాత్రమే పరిమితం అన్న అపవాదును తన ఇమేజ్ కు ఇసుమంత కూడా అంటనివ్వలేదు. విలువలున్న పాత్రల్లో నటించి తనకంటూ ఓ ఫ్యామిలీ ఇమేజ్ క్రియేట్ చేసుకుని సౌత్ ఇండియన్ సినిమాకి స్టార్ హీరోయిన్ స్టేటస్ ను క్రియేట్ చేసుకుంది. ఇండస్ట్రీలో ఎక్కువ సక్సెస్ రేట్ సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ కూడా సౌందర్యే.
అయితే సౌందర్యకి ఛాన్స్ వస్తే దర్శకత్వం కూడా వహించాలని అనుకున్నారట. కానీ.. ఆ కోరిక తీరకుండానే సౌందర్య మృతి చెందారు. సౌందర్య చివరి సినిమా నర్తనశాల కాగా ఈ సినిమా రెండో షెడ్యూల్ సమయానికి సౌందర్య మృతి చెందారు. ఇక సౌందర్య ‘గెలుపు’ అనే సినిమాలో నటించగా ఈ సినిమా షూటింగ్ పూర్తైనా కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల కాలేదు.
ఇండస్ట్రీలో సౌందర్య ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎంతో ఎదిగారు. 25,000 రూపాయల రెమ్యునరేషన్ నుంచి 50 లక్షల రూపాయల పారితోషికం స్థాయికి ఎదిగారు. కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ, హిందీ భాషలలో కూడా సౌందర్య హీరోయిన్ గా నటించి మెప్పించింది.అంతేకాదు సౌందర్య ఒకానొక టైం లో ఏడాదికి పది చిత్రాలు నటించిన క్రెడిట్ కూడా దక్కింది. సౌందర్య తండ్రి సత్యనారాయణ జ్యోతిష్యుడు కాగా, ఆయన 2004లోనే సౌందర్య కెరియర్ అర్ధాంతరంగా ముగుస్తుందని ఆయన ముందే చెప్పారట.