మళ్లీ దాదాగిరి మొదలు కానుంది. భారత్‌కు దూకుడు నేర్పి, విజయాల రుచి చూపించిన దాదా రీఎంట్రీ ఇచ్చాడు. మాటకు మాట, ఆటకు ఆటతో భారతదేశ క్రికెట్ అభిమానుల్లో చిరస్థాయిగా నిల్చిపోయే గంగూలీ న్యూ ఇన్నింగ్స్ ప్రారంభించాడు.
ఆస్ట్రేలియా బౌలర్లను చూస్తేనే మన బ్యాట్స్‌మెన్ హడలెత్తిపోయేవారు. ఫీల్డింగ్‌లో బాల్ వెంట పరుగెత్తటమే కానీ… డైవ్ చేసి పట్టే అలవాటే ఉండేది కాదు. అన్నింటికీ మించి ప్రత్యర్థి నోటికి పనిచెబితే… చూస్తూ ఊరుకునే వారే కానీ తిరిగి జవాబు ఇచ్చే అలవాటు ఉండేది కాదు. ఓరకంగా చెప్పాలంటే పసి కూనలా ఉండే భారత జట్టును సింహల తయారు చేయటంలో కీలక పాత్ర పోషించారు గంగూలీ. కెప్టెన్‌గా దూకుడు ప్రదర్శిస్తూ… క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్‌లో చొక్కా విప్పి తన ఆనందాన్ని పంచుకున్న తీరును భారత క్రికెట్ ఎప్పటికీ మర్చిపోదు.
అలాంటి గంగూలీ ఇప్పుడు దేశ క్రికెట్ బోర్డుకు కెప్టెన్ అయి, కొత్త ఇన్నింగ్స్‌కు శ్రీకారం చుట్టారు. ఓ రకంగా తాను గురువుగా భావించి, అభిమానించే జగ్మోహన్ దాల్మియా విస్తరించిన క్రికెట్ సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు. ఓ అటగాడు క్రికెట్ బోర్డును నడిపించటమే మంచిదే అయినా… కొత్త ఇన్నింగ్స్‌ను గంగూలీ ఎలా తీర్చి దిద్దుతారు, తన అభిమాన దాల్మియా అడుగుజాడల్లో నడిచి… బోర్డుకు కనకవర్షాన్ని, దేశ క్రికెట్‌ను ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి.