బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకునేలా ఉంది. టీమిండియా మాజీ క్రికెటర్, ప్రస్తుత బీసీసీఐ ప్రెసిడెంట్ గంగూలీ ఇంట్రస్టింగ్ ట్వీట్ చేశాడు. ఎందరికో ఉపయోగపడే ఓ పనిని ప్రారంభించాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు. దీన్నిబట్టి త్వరలో రాజకీయ రంగ ప్రవేశం గురించే ప్రకటన చేయబోతున్నాడా? అనే చర్చ జరుగుతోంది.
తన క్రికెట్ జీవితం 30 ఏళ్లు పూర్తయిందని చెబుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు గంగూలీ. “1992లో క్రికెట్ లో అడుగుపెట్టాను. 2022తో 30 ఏళ్లు పూర్తయ్యాయి. క్రికెట్ నాకెంతో ఇచ్చింది. మరీ ముఖ్యంగా మీ అభిమానాన్ని నాకు అందించింది. నేను ఈ స్థాయికి చేరుకోవడానికి సహకరించిన, నా ప్రయాణంలో భాగమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందరికో ఉపయోగపడే ఓ పని ప్రారంభించాలని నిర్ణయించుకున్నా. నా జీవితంలో ఈ సరికొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతున్న వేళ మీ సహకారం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నా” అని ట్వీట్ చేశాడు గంగూలీ.
గంగూలీ ట్వీట్ కు అర్థం పొలిటికల్ ఎంట్రీనే అని అనుకుంటున్నారు అంతా. దానికి సంబంధించే ప్రకటన ఉంటుందని అంచనా వేస్తున్నారు. నిజానికి చాలా రోజులుగా ఆయన బీజేపీలోకి వెళ్తున్నారని ప్రచారం ఉంది. బెంగాల్ లో పాగా వేయాలని చూస్తున్న బీజేపీకి దాదా లాంటి నేత ఉంటే.. దీదీని పదవి నుంచి దించేయొచ్చని భావిస్తున్నట్లుగా సమాచారం.
ప్రస్తుతానికి బెంగాల్ లో ఎన్నికలు లేకపోయినా.. వచ్చే ఎలక్షన్ నాటికి గంగూలీని సిద్ధం చేస్తారని మాట్లాడుకుంటున్నారు. కొందరైతే ఆయన్ను రాజ్యసభకు పంపిస్తున్నారని ఊహించుకుంటున్నారు. చూడాలి.. గంగూలీ ఎలాంటి ప్రకటన చేస్తారో.
— Sourav Ganguly (@SGanguly99) June 1, 2022
Advertisements