ఢిల్లీలో ఈ రోజు ఉదయం జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు నేరస్థులు హతమయ్యారు. నేరస్థులు పోలీసులపై కాల్పులు జరిపినప్పటికీ వాళ్లు తృటిలో తప్పించుకున్నారు. పోలీసులు బుల్లెట్ ప్రూప్ జాకెట్లు ధరించడం వల్ల ప్రాణాపాయం తప్పింది. మరణించిన ఇద్దరు క్రిమినల్స్‌ను రాజా ఖురేషి, రమేష్ బహదూర్‌లుగా గుర్తించారు. ఖురేషి, బహదూర్‌ల కోసం కరవాల్‌నగర్ మర్డర్ కేసు సహా పలు కేసుల్లో ఢిల్లీ పోలీసులు గాలిస్తున్నారు. రెండు రోజుల క్రితం కరవాల్ నగర్ లో ఓ ప్రాపర్టీ డీలర్ షాప్ ను తగుల బెట్టి ఓనర్ ను గాయపర్చాడు. అక్కడికి వెళ్లిన ఇద్దరు పోలీసులను కూడా గాయపర్చాడు. ఆ తర్వాత లోని వెళ్లి అక్కడొక ప్రాపర్టీ డీలర్ ను కాల్చి చంపాడు. దీంతో అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. సోమవారం ఉదయం ఓక్లా మండి ఏరియాలో అతను ఉన్నాడని సమాచారం అందడంతో అక్కడికి వెళ్లన పోలీసులపైకి ఖురేషి, మరో క్రిమినల్ బహదూర్ లు కాల్పులు జరిపారు. పోలీసులు జరిపిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు మరణించినట్టు పోలీసులు తెలిపారు.