ఢిల్లీ: దక్షిణాది రాష్ట్రాలలో కేంద్రం హైఅలర్ట్ ప్రకటించింది. గుజరాత్ లోని సర్ క్రీక్ వద్ద అనుమానస్పద బోట్లను స్వాధీనం చేసుకున్న ఆర్మీ దక్షిణ భారతదేశంలో దాడి చేసేందుకు పడవల ద్వారా చొరబడినట్లుగా భావిస్తున్నామని తెలిపింది. కచ్ ప్రాంతం నుంచి జలమార్గం ద్వారా ఉగ్రవాదులు చొరబడినట్లుగా భావిస్తుండగా ఉగ్రవాదులు కేరళలో ఉన్నట్లుగా ఐబీ వర్గాలకు సమాచారం అందినట్లుగా తెలుస్తుంది. ఆర్మీ అధికారులు పడవలను పరిశీలిస్తుండగా ఐబీ వర్గాలు హైఅలర్ట్ ప్రకటించాయి. ఆఫీసర్లు హెచ్చరికలు జారీ చేసిన తర్వాత కేరళలో ఆర్మీ అధికారులు అలర్ట్ అయ్యారు. తీర ప్రాంతంలో ప్రత్యేకమైన భద్రతలు తీసుకోవాలని సూచించారు. జన సమ్మర్ధం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో, బస్టాండ్, రైల్వే స్టేషన్, ఎయిర్ పోర్ట్ వంటి ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండాలని ఆర్మీ అధికారులు హెచ్చరిస్తున్నారు. జమ్మూ కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ ప్రత్యేక హోదాను తొలగించినప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ఆందోళన వాతావరణం నెలకొంది. కొద్ది రోజులుగా భారత్‌లోకి ఉగ్రవాదులు చొరబడ్డారంటూ వార్తలు వినిపిస్తూనే ఉన్నా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు అయితే చోటు చేసుకోలేదు.