ఈ సారి తొలకరి ముందస్తుగానే పలకరించిందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. కేరళ తీరాన్ని నైరుతి రుతు పవనాలు ముందుగానే పలకరించాయని తెలిపింది. అనగా సాధారణం కంటే మూడు రోజులు ముందుగానే రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకినట్లు ఐఎండీ నిర్ధారించింది.
సాధారణంగా జూన్ 1న కేరళకు నైరుతి రుతు పవనాలు చేరుకుంటాయని భాతర వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు. ఇటీవల బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుఫాను కారణంగా గత నెల నుంచి రుతుపవనాల్లో వేగం పెరిగిందని, ఈ క్రమంలోనే ఈ నెల 27 నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసిందని, అలానే జరిగిందని తెలిపారు.
తాము చెప్పిన సమయానికి నాలుగు రోజులు తేడా ఉండే అవకాశం ఉందని తెలిపింది భారత వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఈ ఏడాది సాధారణ వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది.
సాధారణం కంటే చాలా ముందుగానే అండమాన్ నికోబార్ దీవులను రుతుపవనాలు తాకాయని భాతర వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ పేర్కొన్నారు. భారతీయ వ్యవసాయ ఆధారిత ఆర్థిక రంగానికి నైరుతి రుతుపవనాలు ప్రధాన ఆధారంగా నిలుస్తాయని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.