నిత్యం 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. రెండు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాల రాకతో రానున్న మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేశారు.
నైరుతి రుతుపవనాల కారణంగా ఆదివారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడా చిరు జల్లులు కురిసాయని తెలిపారు. మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, హైదరాబాద్ వరంగల్ ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసినట్టు వెల్లడించారు. సోమ, మంగళవారాల్లో రాష్ట్ర వ్యాప్తంగా గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులుతో పాటు.. అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో భానుడు భగభగమంటున్నాడు. రానున్న రెండు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతల్లో ఎలాంటి మార్పు ఉండవని అధికారులు వెల్లడించారు. ఆ తర్వాత రెండు నుంచి 4,5 డిగ్రీల సెల్సియస్ తగ్గే అవకాశం ఉందని తెలిపారు. జమ్ము, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జార్ఖండ్, విదర్భ, మధ్యప్రదేశ్ లోని ఉత్తర ప్రాంతంలో రాగల రెండు రోజుల పాటు వేడిగాలులు వీచే అవకాం ఉన్నట్టు తెలుస్తోంది.
అస్సాం, మేఘాలయ, పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కింలోని చాలా ప్రాంతాల్లో రానున్న ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు సాధారణ ప్రారంభ తేదీకి కనీసం నాలుగు రోజుల ముందు పశ్చిమ బెంగాల్ కు చేరుకున్నాయని ప్రకటించింది. దీని ప్రభావంతో ఈశాన్య ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.