ఆగ్నేయ ఆఫ్రికాలో ఫ్రెడ్డీ తుపాను బీభత్సం సృష్టించింది. ఫ్రెడ్డీ తుపాను కారణంగా ఆగ్నేయ ఆఫ్రికాలోని మొజాంబిక్ మలావిలో సంభవించిన వరదల కారణంగా 300 మందికి పైగా మరణించగా.. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. తుపాను కారణంగా 326 మంది మృతి చెందినట్లు మలావి డిపార్ట్ మెంట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అఫైర్స్ తెలిపింది.
దాదాపు 183,159 మంది నిరాశ్రయులయ్యారు. వేల సంఖ్యలో ప్రజలు తుపాను సహాయ శిబిరాల్లో ఉన్నారు. బ్లాంటైర్ లో వ్యాక్సిన్ కవరేజ్ చాలా తక్కువగా ఉంది కాబట్టి కలరా వ్యాప్తి చెందే ప్రమాదముందన్నారు. ఈ విపత్తులో మరణించిన వారి సంఖ్య 225 నుంచి 326కి పెరిగిందని మలావి అధ్యక్షుడు లాజరస్ చక్వేరా వాణిజ్య కేంద్రమైన బ్లాంటైర్ సమీపంలోని విధ్వంసానికి గురైన దక్షిణ ప్రాంతంలో చెప్పారు. దేశంలో 40,702 గృహాలు వరదల కారణంగా ధ్వంసమయ్యాయని తెలిపారు.
ఈ వారం కుండపోత వర్షాల కారణంగా వరదలు,బురదజల్లుల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు సిబ్బంది ప్రయత్నాలు కొనసాగుతున్నాయని..ప్రపంచ దేశాలు సాయం అందించాలని చక్వేరా కోరారు. ప్రాణాలతో బయటపడిన వారి కోసం 300 కంటే ఎక్కువ అత్యవసర ఆశ్రయాలను ఏర్పాటు చేశారు. అయితే సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి సైన్యం, పోలీసులను మోహరించారు. దేశంలో రెండు వారాల జాతీయ సంతాప దినాలు, అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మలావి, మొజాంబిక్ మడగాస్కర్ లో ఫ్రెడ్డీ తుపాను కారణంగా ప్రాణనష్టంపై సంతాపం వ్యక్తం చేశారు.
కష్ట సమయాల్లో బాధిత దేశాల ప్రజలకు భారత్ అండగా నిలుస్తుందన్నారు. తుపాను మొదటిసారిగా ఫిబ్రవరి చివరలో దక్షిణ ఆఫ్రికాలోని మడగాస్కర్, మొజాంబిక్ లను తాకింది. తరువాత హిందూ మహాసముద్రం మీదుగా తిరిగి వెళ్లింది. బుధవారం నుంచి వర్షాలు తగ్గుముఖం పట్టాయి. అయితే ఫ్రెడ్డీ ఇప్పటికీ ప్రపంచంలోని అతి పొడవైన ఉష్ణమండల తుపానులలో ఒకటిగా మారడానికి ట్రాక్ లో ఉంది. మొజాంబిక్ లో తుపాను గత వారాల్లో కనీసం 73 మరణాలకు కారణమైంది. పదివేల మంది నిరాశ్రయులయ్యారు. మడగాస్కర్ లో మరో 17 మంది ప్రాణాలు కోల్పోయారు.