తెలుగు రాష్ట్రాల ప్రజలకు గుడ్ న్యూస్. ఇప్పటికే తీవ్రమైన ఎండలతో సతమతమవుతున్న వారికి వాతావరణ శాఖ తీపి కబురు అందించింది. మంగళవారం సాయంత్రానికి నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
కాకినాడ, వైజాగ్ తీర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుండగా.. మంగళవారం సాయంత్రానికి నైరుతి రుతుపవనాలు ఏపీ మొత్తం వ్యాపిస్తాయని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే తీర ప్రాంతాలన్ని దట్టమైన మేఘాలు కమ్మేశాయని వెల్లడించారు.
సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి ఏర్పడిందని.. దీంతో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాల రాకతో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు.
అలాగే తెలంగాణలోనూ చిరు జల్లులు కురిసే అవకాశాలున్నాయన్నారు. మహబూబ్‌నగర్, నల్గొండ, హైదరాబాద్, వరంగల్ ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయన్నారు. మంగళవారం ఏపీలో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని.. గంటలకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొన్నారు వాతావరణ శాఖ అధికారులు.