పశ్చిమ భారత తీర ప్రాంతాలన్నింటినీ విస్తరించిన నైరుతి రుతుపవనాలు.. సోమవారం వరకు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ ప్రాంతాల నుండి తెలంగాణ వైపుకు తక్కువ ఎత్తులో వీస్తున్న గాలుల ప్రభావంతో.. రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు అధికారులు.
శనివారం కురిసిన వర్షపాతాన్ని వాతావరణ శాఖ వెల్లడించింది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా బేలలో 4 సెంటీమీటర్లు, తలమడుగులో 3.5, పిప్పల్ ధరిలో 3.3, నిర్మల్ జిల్లా వడ్యాలలో 2.9, కామారెడ్డి జిల్లా మేనూరులో 2 సెంటీమీటర్ల వర్షం కురిసినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది.
మరోవైపు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలతో వడగాలులు వీస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం రాష్ట్రంలో అత్యధికంగా జగిత్యాల జిల్లా గోధూరులో 42.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్టు వెల్లడించారు. అక్కడక్కడ పిడుగులు పడ్డట్టు స్పష్టం చేశారు.
ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం ధనోర గ్రామంలో పిడుగుపాటుకు గోస్కుల ఆశన్న(55) అనే రైతు మృతి చెందినట్టు వెల్లడించారు. ఇదిలా ఉంటే.. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో ఎండ తీవ్రత అధికంగా ఉంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడడంతో ఊపిరి పీల్చుకున్నారు.