‘షావుకారు’ సినిమాలో నటించి సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న అలనాటి నటీమణి ‘షావుకారు జానకి’ . అసలు పేరు శంకరమంచి జానకి. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో 370 కి పైగా సినిమాల్లో నటించారామె.
అతి చిన్న వయసులో రేడియో నాటికల ద్వారా కెరీర్ ప్రారంభించారు. అనతి కాలంలోనే రంగస్థల, సినీరంగాల్లో తనదైన నటనను ప్రదర్శించి అగ్రసినీ తారల్లో ఒకరిగా కొనసాగారు జానకి. పెళ్లయినప్పటికీ హీరోయిన్ గా సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో పలు హిట్ సినిమాలు చేశారు.
ప్రస్తుతం జానకి వయసు 91 ఏళ్లు. ఇప్పటికి ఈమె 5 తరాల పిల్లలను తన కుటుంబంలోకి ఆహ్వానించారు. ఈమెకు యజ్ఞ ప్రభ అనే కుమార్తె ఉన్నారు. ఆమె అనిమల్ వెల్ఫేర్ యాక్టివిస్ట్ గా ఉన్నారు.
ప్రభ కుమార్తె వైష్ణవి తెలుగు, తమిళ మలయాళ, కన్నడ భాషల్లో కొంతకాలం పాటు హీరోయిన్ గా నటించారు. వైష్ణవి కి అదితి, మేఘన అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అదితికి ఓ కుమార్తె ఉంది.
వీరందరూ కలిసి తాజాగా ట్రిప్ కి వెళ్లారు. అక్కడ వీళ్ళని చూసిన ఫోటోగ్రాఫర్ ‘క్లిక్’ మనిపించారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఐదు తరాల కుటుంబాన్ని చూసే అవకాశం అతి కొద్ది మందికే వస్తుందని.. ఆ విషయంలో జానకి అదృష్టవంతులని నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.