సోయం బాపురావు, బీజేపీ ఎంపీ
రాష్ట్రంలో టీఆర్ఎస్, మజ్లిస్ నేతల అరాచకాలకు, అఘాయిత్యాలకు అంతు లేకుండా పోతోంది. గత కొంత కాలంగా రాష్ట్రంలో ఎక్కడ హత్యలు, అఘాయిత్యాలు జరిగినా అందులో టీఆర్ఎస్ నేతల హస్తం ఉంటోంది. మంథనిలో లాయర్ వామన్ రావు హత్య, కొత్తగూడెంలో వనమా రాఘవేంద్ర ఆగడాలతో పిల్లలతో సహా కుటుంబం ఆత్మహత్య, ఖమ్మంలో టీఆర్ఎస్ నేతల వేధింపులు తాళలేక బీజేపీ కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య, సూర్యాపేట జిల్లా కోదాడలో పేదింటి ఆడబిడ్డపై టీఆర్ఎస్ నేతల సామూహిక అత్యాచారం, రామాయంపేటలో టీఆర్ఎస్ మున్సిపల్ ఛైర్మన్ వేధింపులు తాళలేక తల్లీ కుమారుడు ఆత్మహత్య, నిర్మల్ లో బాలికపై టీఆర్ఎస్ మున్సిపల్ ఛైర్మన్ అత్యాచారం వంటి సంఘటనలు ఇలా కోకొల్లలు ఉన్నాయి.
నగరం నడిబొడ్డున జూబ్లీహిల్స్ లో మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేయడం టీఆర్ఎస్, మజ్లిస్ పార్టీల ఆగడాలకు పరాకాష్ట. ఈ కేసులో టీఆర్ఎస్ కు చెందిన వక్ఫ్ బోర్డు ఛైర్మన్ కుమారుడు, మజ్లిస్ ఎమ్మెల్యే కుమారుడితోపాటు టీఆర్ఎస్ కు చెందిన ప్రముఖుల పిల్లలు కూడా ఉన్నట్లు అన్ని ఆధారాలు లభించాయి. సీసీ పుటేజీ రికార్డులున్నాయి. పైగా ఛైర్మన్ ఉపయోగించే ప్రభుత్వ వాహనంలోనే అత్యాచారం జరిగినట్లు పత్రికల్లో వార్తలొస్తున్నాయి.
ఇప్పటి వరకు అసలు నిందితులను అరెస్ట్ చేయకుండా కేసును నీరుగార్చేలా పోలీసులు వ్యవహరిస్తుండటం బాధాకరం. సామాన్యులు చిన్న చిన్న తప్పిదాలు చేస్తే మీడియా ఎదుట నానా హంగామా చేసి అరెస్ట్ చేసి జైలుకు పంపే పోలీసులు ఈ కేసులో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుండటం సిగ్గు చేటు.
తక్షణమే ఈ కేసును సీబీఐకి అప్పగించాలి. నిందితులు ఏ మూల దాగి ఉన్నా.. పోలీసులు వెంటనే అందరినీ అరెస్ట్ చేసి కఠిన శిక్షపడేలా చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి.