యూపీ ఉప ఎన్నికల్లో మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ భార్య డింపుల్ యాదవ్ బంపర్ మెజారిటీతో విజయం సాధించారు. గతంలో తన మామ ములాయం సింగ్ యాదవ్ పేరిట ఉన్న రికార్డును ఆమె బద్దలు కొట్టారు. మైనపురి నియోజక వర్గంలో సమీప ప్రత్యర్థి బీజేపీ నేత రఘురాజ్ సింగ్ షాక్యాపై ఏకంగా 2 లక్షల 38 వేల ఓట్ల తేడాతో గెలుపొంది సరికొత్త రికార్డు సృష్టించారు.
సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ ఇటీవల మరణించారు. ఆయన మరణం నేపథ్యంలో ఉప ఎన్నిక అనివార్యమైంది. 2019 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రేమ్ సింగ్ పై ములాయం సింగ్ 94 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.
తాజాగా డింపుల్ 2.38 లక్షల మెజార్టీతో విజయాన్ని అందుకున్నారు. సమాజ్‌వాదీ పార్టీకి మైనపురి కంచుకోటగా వుంది. ఈ నియోజక వర్గంలో ఈ నెల5న ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో 56 శాతానికి పైగా ఓటింగ్ నమోదైంది. ఎస్పీకి 64.2 శాతం ఓట్లు రాగా, బీజేపీ 34.1 శాతం ఓట్లు వచ్చాయి.
ఇక బిహార్‌లోని కుర్హానీ ఉప ఎన్నిక ఫలితాల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో మహాఘట బంధన్ అభ్యర్థి మనోజ్ సింగ్ కుశ్వాహపై బీజేపీ నేత కేదార్ గుప్తా గెలుపొందారు. గుప్తాకు 76,653 ఓట్లు రాగా, కుశ్వాహకు 73,008 ఓట్లు వచ్చాయి.
కుర్హానీ ఎమ్మెల్యేగా ఉన్న ఆర్జేడీ నేత అనిల్ కుమార్ సహానిపై అనర్హత వేటు పడింది. ఈ నేపథ్యంలో కుర్హానీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికలో 13 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వారిలో ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉన్నారు.