కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. ప్రతిపక్ష పార్టీలకు వ్యతిరేకంగా కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేసినందుకు రాబోయే రోజుల్లో బీజేపీ కూడా కాంగ్రెస్ లాగానే రాజకీయంగా అంతమవుతుందని అన్నారు.
యూపీఏ-2 పాలనలో కుల గణన చేపడుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందన్నారు. కానీ ఆ తర్వాత వెనక్కి తగ్గిందని ఆయన వెల్లడించారు. మోడీ సర్కార్ కుల గణన చేపట్టాలని పలు పార్టీలు డిమాండ్ చేస్తున్నాయన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఇది ప్రధాన అంశంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు.
కానీ కాంగ్రెస్ లాగే కాషాయ పార్టీ కూడా దీన్ని నిర్వహించేందుకు ఆసక్తి చూపడం లేదంటూ ఆయన ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కేంద్ర సంస్థలను దుర్వినియోగం చేసేదని ఆయన తెలిపారు. ఇప్పుడు బీజేపీ కూడా అదే పని చేస్తుందని మండిపడ్డారు.
ఇప్పుడు కాంగ్రెస్ అయిపోయిందని చెప్పారు. రాబోయే రోజుల్లో బీజేపీకి కూడా ఇదే గతి పడుతుందన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ప్రతిపాదిత ప్రతిపక్ష ఫ్రంట్ ఫార్ములా ఏమిటని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం దాట వేశారు. అది బహిర్గతం చేయకూడని విషయమన్నారు.