కరోనా వైరస్ సెకండ్ వేవ్ ముంచుకొచ్చిన క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలకు పూనుకుంది. రాష్ట్రంలో మాస్క్ వాడటం తప్పనిసరి చేస్తూ.. అది ధరించని వారికి స్పాట్‌లోనే జరిమానా విధించే పని పోలీసులకు అప్పగించింది. దీంతో మాస్క్ లేకుండా రోడ్లపై తిరుగుతున్నవారిని గుర్తించి పోలీసులు జరిమానా విధిస్తున్నారు. ఈ క్రమంలో గుంటూరులో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
ఎస్పీ అమ్మిరెడ్డి లాడ్జి కూడలి, ఎంటీబీ కూడలిలో తాజాగా నిర్వహించిన స్పెషల్ డ్రైవ్‌లో పాల్గొన్నారు. అదే సమయంలో తుళ్లూరు ట్రాఫిక్ సీఐ మల్లికార్జునరావు మాస్కు ధరించకుండా అటుగా వెళ్లడాన్ని ఎస్పీ గుర్తించారు. వెంటనే సీఐని ఆగమని .. మాస్క్ ఎందుకు ధరించలేదని ప్రశ్నించారు. దీంతో హడావిడిలో మర్చిపోయాను సార్ అంటూ సీఐ మల్లికార్జునరావు సమాధానమిచ్చారు. దీంతో ఎస్పీ.. సీఐ మల్లి మల్లికార్జునరావుకు జరిమానా విధించారు. అనంతరం స్వయంగా మల్లికార్జున రావుకు మాస్క్ తొడిగారు. ఈ సన్నివేశాన్ని అక్కడున్న కొందరు వీడియో తీశారు. ఇప్పుడది వైరల్ అవుతోంది.