యూపీ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాది పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్ కన్ను మూశారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో గుర్ గ్రామ్‌లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఆయన తుది శ్వాస విడిచారు.
అనారోగ్య సమస్యలతో ఆయన ఆగస్టు 22న మేదాంత ఆస్పత్రిలో చేరారు. అప్పటి నుంచి ప్రత్యేక వైద్య నిపుణుల పర్యవేక్షణలో చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం క్షీణించింది. దీంతో ఆయన్ని ఐసీయూకి తరలించి చికిత్స అందజేశారు.
ఆదివారం సాయంత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించినట్టు మేదాంత ఆస్పత్రి నిన్న హెల్త్ బులిటెన్ లో పేర్కొంది. ఆయనకు లైఫ్ సేవింగ్ మెడిసిన్స్ అందించి చికిత్స చేస్తున్నట్టు వైద్యులు తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో తుది శ్వాస విడిచారు.
యూపీలోని ఇటావాలో 1939 ఆగస్టు 22న జన్మించారు. రామ్ మనోహర్ లోయా సిద్దాంతలతో ప్రేరణ పొంది రాజకీయాల్లో చేరారు. 1967లో తొలిసారి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత 1989లో మొదటి సారిగా రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 1992లో సమాజ్ వాది పార్టీని ఆయన ఏర్పాటు చేశారు.