స్పెయిన్‌లో అత్యవసర ల్యాండింగ్ చేసిన విమానం నుంచి 27 మంది పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిలో 13 మందిని పోలీసులు పట్టుకోగా, మిగతా వారు పరారయ్యారు. దీంతో వారి ఆచూకీ కోసం స్పెయిన్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
పోలీసుల వివరాల ప్రకారం…. పెగాసిస్ ఎయిర్ లైన్స్‌కు చెందిన విమానం ఒకటి 228 మంది ప్రయాణీకులతో క్యాసబ్లాంకా(మొరాకో) నుంచి ఇస్తాంబుల్(టర్కీ)కి వెళుతోంది. అందులో ఓ గర్బిణీకి పురిటి నొప్పులు వచ్చాయి. ఈ క్రమంలో విమానాన్ని జోసెఫ్ టారా డెల్లాస్ బార్సిలోనాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
వెంటనే మహిళను బయటకు తీసుకు వెళుతున్న సమయంలో 27 మంది ప్రయాణికులు ఎలాంటి అనుమతి లేకుండా విమానం నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిలో 13 మందిని పోలీసులు అడ్డుకున్నారు. మిగతా వారు పోలీసుల కండ్లు గప్పి విమానాశ్రయం నుంచి తప్పించుకుని పారిపోయారు.
ఇది ఇలా వుంటే ప్రసవ వేదనలో ఉన్న మహిళను ఎయిర్ పోర్టు సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. అయితే ఆమె గర్భవతి అయినప్పటికీ ఆమెకు ఇప్పుడే ప్రసవించే అవకాశం లేదని వైద్యులు వెల్లడించారు. దీంతో తోటి ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించినందుకు ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పారిపోతున్న 13 మంది ప్రయాణికులను పోలీసులు పట్టుకున్నారు. వారిలో ఐదుగురు విమానంలో తిరిగి ఇస్తాంబుల్‌కు వెళ్లేందుకు అంగీకరించారు. మిగిలిన ఎనిమిది మందికి స్పెయిన్‌లో ప్రవేశం లేని కారణంగా వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని మరొక పెగాసస్ విమానంలో ఎక్కించే అవకాశాలు ఉన్నాయి.