హాస్పిటల్ వెయిటింగ్ రూమ్ లో వేలాదిగా పేషెంట్లు…మార్చురీలో కుప్పలు కుప్పలుగా శవాలు..ఎవరు చనిపోతారో ముందు గానే నిర్ణయించి డెత్ సర్టిఫికెట్లపై సంతకాలు చేస్తోన్న డాక్టర్లు…ఇదీ స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ లోని పరిస్థితి. స్పెయిన్ లో కరోనా వైరస్ సృష్టిస్తున్న విలయం అంతా ఇంతా కాదు. కరోనా వైరస్ బారిన పడిన పేషెంట్ల సంఖ్య ఎక్కువగా ఉండడం మెడికల్ సిబ్బంది తక్కువ కావడంతో హాస్పిటల్ వెయిటింగ్ రూమ్ ల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు. మృతుల అంత్యక్రియలు నిలిచిపోయాయి. మార్చురీలు నిండిపోయాయి. మృతదేహాలను ప్యాక్ చేసి ఐస్ రూమ్ లో స్టోర్ చేస్తున్నారు.
ఇంటెన్సివ్ కేర్ వార్డులు పేషెంట్లతో నిండిపోయాయి. వృద్ధ పేషెంట్లు యువతకు దూరంగా ఉండాలని డాక్టర్ డానియల్ బెర్నబు హెచ్చరిస్తున్నారు. 4 కోట్ల 70 లక్షల జనాభా ఉన్న స్పెయిన్ దేశంలో కరోనా మృతుల సంఖ్య చైనా, ఇటలీ కంటే చాలా వేగంగా పెరుగుతోంది.
బుధవారం ఒక్కరోజే 738 మంది చనిపోయారు. అది గురువారం నాటికి 655 కు తగ్గింది. ఇప్పటి వరకు స్పెయిన్ లో చనిపోయిన వారి సంఖ్య 4,089 మంది. ఇది వైరస్ ముందుగా ప్రబలిన చైనాలో చనిపోయిన వారి కంటే ఎక్కువ. మూడు వారాల క్రితం వైరస్ ను నియంత్రిస్తామని చాలా ఈజీగా చెప్పిన ఆ దేశ ప్రధాన మంత్రి పెడ్రో సాంచెజ్ వైరస్ పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇలాంటి అనుభవం తన జీవితంలో ఎప్పుడు ఎదురు కాలేదన్నారు. పౌర యుద్ధంలో పెద్ద ఎత్తున ప్రాణాలు కోల్పోయిన వారిని చూసిన వృద్ధులు కొంత మంది ఉన్నారే తప్ప ప్రస్తుతమున్న దారుణ పరిస్థితిని గతంలో చూసిన వాళ్లెవరూ లేరని అన్నారు. మార్చి 14 నుంచి దేశంలో ఎమర్జెన్సీ విధిస్తున్నామని…ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దంటూ డ్రోన్లకు లౌడ్ స్పీకర్లు అమర్చి ప్రచారం చేశారు. ఇలాంటి పరిస్థితిని గతంలో ఎవరూ చూడలేదు…మున్ముందు కూడా ఎవరూ చూడలేరని ప్రధాన మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
మాడ్రిడ్ లో 17 భవనాలతో కూడిన అతిపెద్ద హాస్పిటలైన లా పాజ్ హాస్పిటల్ లో పరిస్థితి భయంకరంగా ఉంది. ఒక్క ఎమర్జెన్సీ రూమ్ లోనే 240 మంది పేషెంట్లు ఉన్నారు. డాక్టర్లకు పుల్ ప్రొటెక్షన్ దుస్తులు లేవు. కేవలం మాస్క్, కాటన్ రోబ్ మాత్రమే ఉన్నాయి. పేషెంట్లు మీటర్ దూరంలో ఉండాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నప్పటికీ అది సాధ్యం కావడం లేదు. ”నా చుట్టూ ఉన్న డాక్టర్లు అలసి పోయి అస్వస్థతకు గురయ్యారు. నేను రేడియాలజిస్ట్ ను …నేను ఎమర్జెన్సీ రూమ్ లో పని చేయకూడదు” అని డాక్టర్ బెర్నబు చెప్పారు.
లాక్ డౌన్ ను లెక్కపెట్టకుండా మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి మద్దతుగా నిర్వహించిన ప్రదర్శనల్లో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇదే ఆ దేశం కొంప ముంచింది. ఆ రోజు నుంచి వైరస్ వ్యాప్తి చెందింది. ప్రదర్శన అనంతరం కొన్ని రోజుల్లోనే వైరస్ పాజిటివ్ పేషెంట్ల సంఖ్య పెరిగింది. అది చాలా వేగంగా విస్తరించి నియంత్రణ దశను దాటింది. ప్రభుత్వం ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడింది. హాస్పిటళ్లన్ని పేషెంట్లతో నిండిపోతున్నాయి. కొందరు పేషెంట్లు ఇళ్లలోనే ఉండి అక్కడే చనిపోతుండగా..మరి కొందరు రోడ్ల మీద చనిపోతున్నారు. రోడ్ల మీద చనిపోయిన వారి చుట్టుపక్కల వైరస్ వ్యాపించకుండా ఆర్మీ కెమికల్స్ చల్లడం వంటి చర్యలు చేపడుతుంది. వైరస్ వ్యాప్తిని గుర్తించే సామర్ధ్యత తమ దగ్గర లేదని ఆ దేశ హెల్త్ మినిస్ట్రీ అంగీకరించింది. మాడ్రిడ్ శివారులో పేషెంట్ల కోసం మరో పెద్ద హాస్పిటల్ నిర్మిస్తున్నారు. ఇప్పటికే 1400 బెడ్లు ఉండగా…మరో 5000 బెడ్లతో నిర్మిస్తున్న ఈ హాస్పిటల్ నిర్మాణం ఈ వారాంతంలో పూర్తి కానుంది.