ప్రధాని మోడీ నేతృత్వంలో జీ20 సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హాజరు కానున్నారు. ఈ క్రమంలో జీ20 సమ్మిట్, గుజరాత్ ఎన్నికల గురించి ఆమె సంచలన వాఖ్యలు చేశారు.
భారత ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం… పోలింగ్ రోజున రోడ్ షోలు నిర్వహించేందుకు ఎవరికీ అనుమతిలేదని ఆమె పేర్కొన్నారు. నిబంధనలను కాదని ఎవరైనా ప్రచార కార్యక్రమాలు చేస్తే వాళ్లకి ఎన్నికల ఉల్లంఘన చట్టం ప్రకారం శిక్ష పడుతుందన్నారు.
గుజరాత్‌లో మాత్రం ప్రధాని మోడీ, ఆయన పార్టీ వీవీఐపీలు, కార్యకర్తలు ఏదైనా చేయొచ్చని మండిపడ్డారు. సమావేశాలు పెట్టుకోవచ్చని, రోడ్ షోలు జరుపుకోవచ్చన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారిని క్షమిస్తుందని ఆమె ఆరోపించారు.
ఇక జీ20 సమ్మిట్, లోగో వివాదంపై స్పందించిన ఆమె… ఇదేదో రాజకీయ లబ్ధికోసం ప్రధానమంత్రితో జరిగే సమావేశాలు కావన్నారు. కమలం పువ్వు జాతీయ పుష్పం అయినప్పటికీ, అది రాజకీయ పార్టీ లోగో కూడా అని ఆమె వెల్లడించారు.
అందువల్ల కమలం పువ్వు గుర్తును జీ20 లోగోగా ఉపయోగించటంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కమలం పువ్వుకి బదులు ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయని చెప్పారు. వాటిని కూడా ఎంపిక చేయొచ్చని సూచించారు. జీ20 లోగోకు కమలం పువ్వు గుర్తును ఉపయోగించడంపై దేశంలోని చాలా పార్టీలు విమర్శిస్తున్నాయి.