మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా రాజమౌళి ప్రత్యేక రచన
ఓ మహాత్మా ! ఓ మహర్షీ !
మీరు పుట్టి 150 ఏళ్ళు అయినా మీరు మమ్మల్ని వదిలి వెళ్లి 70 ఏళ్లు దాటినా, అందరూ మిమ్మల్ని తమ ఇంట్లో ఆత్మీయ సభ్యునిగా తలుచుకొంటున్నారు. మీరు రాసిన ఆత్మ కథ మళ్లీ మళ్లీ చదివాము.చదివిస్తున్నాము. ఎంత అదృష్టవంతులు మీరు. మీ బాల్యం ఎంత మధురంగా గడిచింది.. మీరు ఎదుగుతున్నప్పుడు మీకు ఎంత స్వేచ్ఛ ఉండేది.. అదంతా చాలా బాగుంది అంటున్నారు కానీ మీ మార్గంలో వెళ్ళటానికి ముందుకు రావడం లేదు. మిమ్మల్ని కూడా మాట్లాడని దేవుడిలా మార్చేసి దండలతో సరిపెట్టేస్తున్నారు.
ఏ దేశానికి వెళ్లినా మన దేశాన్ని, కన్నవారిని, మన సంస్కృతిని మరిచిపోక.. మీరే కాక ప్రపంచంలో అందరూ వీటిని గుర్తుంచుకునేటట్లు ఎంత గొప్పగా జీవించారు. మీరు చెప్పిన దాని కంటే చేసి చూపిందే ఎక్కువ కదా.. గుళ్ళూ గోపురాలు చుట్టూ తిరుగుతూ, కనిపించని దేవుని ఎక్కడో వెతుకుదాం అనుకుంటున్న ఇప్పటివారికి, మనలోనే, మన పక్కన ఉన్న వారిలోనే దైవం ఉన్నాడనే నిత్య సత్యాన్ని మీ జీవితం ద్వారా ఎంత గొప్పగా చెప్పారు. మీరు జాతిపిత. ఈ తరానికి ముత్తాత అవుతారో ఇంకా పెద్ద తాత అవుతారో తెలియదు కానీ మిమ్మల్ని ఒక్కసారి చూసి, మాట్లాడి, నేర్చుకుని మీతో కలిసి నడవాల్సిన అవసరం ఉంది. మీరు మామూలు మనిషి నుండి మహాత్ముడిగా మహర్షిగా ఎలా మారారో ఒక్కసారి ఈ తరం తెలుసుకోవాలి. మీరు వచ్చి ఒక్కసారి మళ్ళీ అందర్నీ తట్టి లేపితే ఎంత బాగుంటుందో కదా.
బాల్యంలో అమ్మలు గోరుముద్దలు తినిపిస్తూ సత్య హరిశ్చంద్రుడి కథ చెప్పటం లేదు. అర్థం గాని భాషలో, ఏవో అర్థంకాని పదాలు, రైమ్‌లు చెప్పిస్తున్నారు. అవి ఏమిటి, ఎందుకు అని అడిగినా చెప్పేవారు లేరు. వాటితో ఈ తరం అర్ధం కాని అయోమయంలో కొట్టుమిట్టాడుతూ ఎలా ఎదుగుతారో తెలియటం లేదు. సంస్కృతి తెలియకో, సాధన చేయకో, సౌందర్యం తగ్గుతుందనో అసలు పాలు ఇవ్వటమే మర్చిపోయినట్లుంది అమ్మలు. పాల పీకతో ఒక డబ్బాను నోట్లో పట్టించి ఇవే అమ్మ పాలు అంటున్నారు. అవి అమ్మ పాలు కాదని తెలుసు. అయినా ఏం చేయటం.. అమ్మపాలతో పాటే అమ్మ భాషను కూడా మరిచిపోయారు. అమ్మ అని పిలిపించుకునేవారూ, పిలిచేవారూ తగ్గిపోయారు. అమ్మతనం, అమ్మ భాష ‘మమ్మీ’లుగా మారిపోతుంటే అచేతనంగా, అసహాయంగా, అనాసక్తంగా ఉంటూ కొండెక్కుతున్న జాతి వెలుగు దివ్వెలను మళ్లీ వెలిగించటానికి మీరు మళ్లీ రావాలి. వెన్నెల్లో ఆకాశం కింద మంచం వేసుకుని చందమామను రమ్మని పిలిచి నిద్ర పుచ్చటం లేదు. రాముడికి వాళ్ళ నాన్న చందమామను తెచ్చి చూపమంటే అద్దంలో చూపించి ఇదిగో రామా అని చేతి ముందు పెట్టాడట. అందుకేనేమో ఆయన తండ్రి మాట అంటే అంత భక్తితో మరు మాట్లాడకుండా తండ్రిని గొప్పవాడిని చేయటానికి అడవికి వెళ్ళిపోయాడు. మొబైళ్లను, టీవీలను క్కొంచెం పక్కన పెట్టి మాతో కాసేపు గడుపుతూ, పిల్లలకు అలా చెప్పే తల్లి తండ్రులు పెరగాలంటే మీరు మళ్లీ రావాలి.
తల్లి తండ్రులు కాళ్లు నొక్క మని పిల్లల్ని పిలవటం లేదు. ఒకవేళ పిలిచినా వాళ్ళు వచ్చి నొక్కటంలేదు. ఒకవేళ నొక్కినా, కాళ్ళు నొక్కే టప్పుడు గాంధీ తాతలాగా, భగత్‌సింగ్ లాగా గొప్ప పనులు చేయాలని పెద్దవాళ్ళు చెప్పటం లేదు. అర్థం తెలియని భాషలో పాఠాలు, పుస్తకాలు చదివిస్తూ, ఎప్పుడూ ఎదో ఒక ఎంట్రన్స్ రాయిస్తూ, ఎల్కేజీ నుంచి ఐఐటీ కోసం చదవమని ఆరాట పడుతున్నారు. పోరాట పెడుతున్నారు. ఆనందం మర్చిపోతున్నారు. పెద్దవాళ్లకే తెలియడంలేదు ఈ పరుగులెందుకో ఎక్కడికో.. పిల్లలు స్కూల్‌కి నడిచి వెళ్తానంటే ఒప్పుకోరు. ఆడుకోవటానికి మిత్రుల దగ్గరకు వెళ్తానంటే సమయం నష్టమైపోతుంది అంటారు. మీ బాల్యంలో మీరు ఎంత బాగా ఆడుకున్నారో కదా!!!
మీరు రోజుకి కనీసం పది మైళ్లు నడిచే వారు. అది కూడా ఏదో ఒక పని కోసం. మీరు స్కూల్ కి నడిచి వెళ్లే వారు. ఇప్పటి పిల్లలకు ఆ అదృష్టం లేదు. ఆ ఇరవై నిమిషాల్లో కూడా మరో రెండు మార్కుల కోసం ప్రయత్నించమంటూ వెంటపడుతున్నారు. ఆటలు లేక వొళ్ళు పెరిగిపోతుంటే, మళ్లీ పార్కుకి వెళ్లి వాకింగ్ చెయ్యమంటున్నారు. ఇదేంటో అర్థం కావటం లేదు. పనిగట్టుకుని మరీ వెళ్లి వాకింగ్ చేయడం ఏంటి.. పని కోసం కదా నడవాలి.. ఏమో.. ? పిల్లల బాల్యం పిల్లలకు తిరిగి ఇవ్వాలంటే మీరు మళ్లీ ఒక్కసారి రావాలి.
పాఠం చెప్పినప్పుడు, పరీక్ష పెట్టి డిక్టేషన్ రాయమ్మన్నప్పుడు మీకు చిన్నపుడు టీచరు గారు చెప్పినట్లుగా పక్క వాడి దాంట్లో చూసి రాయమని సైగ చేయడం లేదు గాని, పరీక్షలో ఏ ప్రశ్నలు అడుగుతారో ముందే చెప్పేస్తున్నారు. మీరే కదా జీవితమే ఒక పరీక్ష. ఈ పరీక్షలో ఎన్నో తెలియని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది.. అందుకే పిల్లలు పరీక్షల కోసం కష్టపడి చదవాలి అని చెప్పేవారు. ప్రశ్నలు చెప్పేసి పరీక్ష రాయిస్తే.. ఇదే అలవాటు కొనసాగితే పెద్దయిన తర్వాత జీవితంలో వచ్చే పెద్ద ప్రశ్నలకు సమాధానం రాయగలరా ఈ తరం…జీవితమనే పరీక్షలో ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యేందుకు కావలసిన విలువల పునాది, నైపుణ్యం, నైశిత్యం ఈ తరానికి అలవడాలంటే మీరు మళ్లీ ఒక్కసారి రావాలి.
తెల్లవారుజామున మూడున్నర గంటలకు లేచి ప్రార్ధన చేసే వారు మీరు. తోటివారితో కూడా చేయించే వారు అదీ అందరూ చల్లగా ఉండాలని. ఇప్పుడు తెల్లవారు జామున సామూహిక ప్రార్ధనలు లేవు. గుళ్లో దేవుడి దగ్గరకు వెళ్లినా నీ దగ్గరకొస్తే నాకేమిస్తావు.. నాకిదొస్తే నేను నీకు అది ఇస్తాను అనే వ్యాపారం చేస్తున్నారు. తోటి మనుషులతో, గుళ్లో దేవుళ్ళతో వ్యాపార సంబంధమే. మరి అసలైన జ్ఞాన జ్యోతి వెలిగేది ఎప్పుడు.. అలా వెలిగించగలిగే గురువుల గురుపూజోత్సవానికి కూడా ప్రార్ధనలు జరగటంలేదు. ఏవో అర్ధం కాని పాటలకు అందరూ పదం, పాదం కలుపుతున్నారు. తెల్లవార్లూ ఇలా గడిపి తెల్లవారుజామున ఎవరు లేవటం లేదు. స్వచ్ఛమైన గాలి వెలుతురులో కూడా పడుకోవటం లేదు. సూర్యుడు వచ్చి తన పని తాను చేసుకుపోతున్నాడు గానీ… సూర్యుడి వచ్చేసరికి అన్ని పనులు చేసుకున్న మీలాగా ఎవరూ దినచర్యను పాటించడం లేదు. అందరూ బాగుండాలని, అందరి బాగు కోసం మీరు చేసిన ప్రార్థన చేయటం కోసం అయినా మీరు మళ్ళీ రావాలి.
‘ప్రకృతిలో దొరికే ఆహారమే పంచభక్ష్య పరమాన్నాలు అని.. పంచభూతాలైన భూమి ఆకాశం గాలి నీరు నిప్పు.. ఇవే మనకు నిజమైన డాక్టర్ల’ని మీరు ఆచరించి చూపిన మార్గం ఎందుకో చాలామందికి వెగటు అయిపోయింది. తినడం కోసమే పుట్టామా అన్నట్టుగా అర్ధరాత్రి దాకా తింటూనే తాగుతూనే గడుపుతున్నారు… మరి అవి జీర్ణమయ్యే ది ఎప్పుడు? నిద్ర పట్టేది ఎప్పుడు ?మెలకువ వచ్చేది ఎప్పుడు?… ప్రకృతికి దూరంగా జరిగిపోయి, శరీరంలో వైపరీత్యాలు ఏర్పడి తే వాటిని వదిలించుకోవటానికి పొద్దస్తమానం ఆస్పత్రుల చుట్టూ పరుగెడుతున్నారు. ‘మన తిండే మనం. మన తిండే మన మందు… మన దినచర్యే మన వైద్యుడు..’ అని గదా మీరు చెప్పింది. ఈ విషయాన్ని అందరూ మర్చిపోయారు. మన నేలలో పండే, మన వాతావరణానికి సరిపడిన ఆహారం తినకుండా దేశ విదేశాల నుంచి రకరకాల రుచులు దిగుమతులు చేసుకొని వాటితో పాటు రోగాలను కూడా దిగుమతి చేసుకుంటున్నారు. తిండినీ, శరీరాన్ని, దినచర్యను నియంత్రించకుండా రోగాలు ఎలా ఆగుతాయి అని ఆలోచించడం లేదు… వీళ్లందరినీ మళ్లీ ఒకసారి పట్టి లేపటానికి మీరు రావాలి.
అవసరాలు, ఖర్చులు తగ్గించుకుని ధనవంతుల్లా జీవించమని కదా మీరు చెప్పింది. అయితే ఈ సహజ సంపదను ఎవరూ ఇష్టపడటం లేదు. అవసరాలు, ఖర్చులు రోజు రోజుకు పెరుగుతూ వెళ్లిపోతున్నాయి. ఆదాయం ఎంత పెరిగినా ఏదో తెలియని అసంతృప్తి. దేవుడిచ్చిన రంగు మార్చుకోవాలనో, దేవుడు చేసిన రూపం మార్చుకోవాలనో, అనవసరమైన హంగులు సమకూర్చుకోవాలనో, అవసరాన్ని మించి ఖర్చులు పెడుతూ కృత్రిమ పేదరికాన్ని అనుభవిస్తున్నారు. వారు సంతృప్తిగా ఉండటం లేదు. ఎవరిని సంతృప్తి పరచాలని ప్రయత్నిస్తున్నారో అర్థం కావడం లేదు. చెట్టు వేళ్లు బలంగా ఉండి లోపల పచ్చగా ఆరోగ్యంగా ఉంటే నే బయట పచ్చగా ఉంటుంది అని చెప్పే వారు మీరు. బయటికి పచ్చ రంగు వేసుకుని, వేళ్ళు కాండం ఎలా పోయినా పర్వాలేదు అనే పరిస్థితి ఏర్పడిపోతోంది ఇప్పుడు.
‘ప్రకృతి అందరి అవసరాలను తీర్చడానికి సరిపడినన్ని వనరులని తనలో ఇముడ్చుకుని ఉంటుంది… అయితే ఏ ఒక్కరి దురాశను తీర్చడానికి అది సిద్ధంగా ఉండదు..’ అని మీరు చెప్పి ఆచరించి చూపిన పాఠాలు అందరూ మర్చిపోయారు. తినే ఆహారం కంటే పారవేసే ఆహారం, తాగే నీటి కంటే కలుషితం చేసే నీరు, నాటే మొక్కల కంటే నరికే మొక్కలు ఎక్కువయ్యాయి. పెళ్లి పందిరి లా ఉండాల్సిన పర్యావరణ పందిరి స్మశానంలా విలపిస్తోంది. ఈ భూమండలాన్ని మళ్లీ పెళ్లి పందిరిలా చేయడానికి మీరు మళ్లీ రావాలి…
మరుగుదొడ్ల మాలిన్యాన్ని తొలగించడాన్ని మనో వైకల్యాలను తొలగించుకోవటానికి, మనసును శుద్ధి చేసే మార్గంగా మలచుకున్న మీరు…. పరిసరాల పరిశుభ్రత తో పాటు మనిషి అంతర్ పరిశుభ్రత అనివార్యమని పాటించి చూపారు. సత్ప్రవర్తన, సదాలోచనలు, సత్సంగం, సత్యం, అహింస అనే సహజ పుష్పాలను ధరించి చందన వృక్షం లా నిత్య చల్లదనాన్నిచ్చే మీ మార్గాన్ని వదిలి పెట్టి, దేశ విదేశాల నుంచి పరిమళ ద్రవ్యాలను తెప్పించుకొని ఎంత పులుముకున్నా అంతర్ పరిమళం లేని కారణంగా, కారుణ్యం లేని కారణంగా మానవ సంబంధాలు దుర్గంధ భరితం గానే ఉంటున్నాయి. మేమంతా సహజ సుగంధ భరితమైన మీ సన్మార్గంలో పయనించాలంటే మీరు మరొక్కసారి రావాల్సిందే.
నిద్ర లేచినప్పటినుంచి ఒక నిర్దిష్ట ప్రణాళిక లేకుండా, సమయాన్ని సరదాగా సారం లేని పనులతో గడపటానికి అలవాటు పడుతున్న ఈ తరానికి….తామేంటో, తమ లక్ష్యమేంటో తెలియ చేయటానికి మీరు ఒక్కసారి మళ్లీ రావాలి. పక్క మనిషి తో మాట్లాడటానికి, కష్టంలో ఓదార్చడానికి కూడా సమయం లేకుండా, టీవీలతో మొబైళ్ల తో ఊకదంపుడు ఊసుపోని కబుర్లతో పేకాటలతో కాలాన్ని గడిపేస్తున్న ఈ తరంతో నూలు వడకటం, పాఠాలు బోధించడం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచటం, మద్యపానాన్ని మానివేయటం, జీవితాన్ని జీవించడం నేర్పే విద్యను అభ్యసించడం, దురలవాట్లను రూపుమాపటం, సమాజంలో సమానత్వాన్ని తీసుకువచ్చి సామాజిక స్వాతంత్ర్యాన్ని తీసుకురావడం, రైతును కూలీని పేదవాడిని ప్రోత్సహించే దిశగా జీవన చర్యను రూపొందించుకోవడం లాంటి నిర్మాణాత్మక కార్యక్రమాన్ని రూపొందించి ఆచరించి అమలు చేయించటానికి మీరు మళ్లీ రావాలి.
ఒక చెంప మీద కొడితే రెండవ చెంపను చూపించమని అన్న మీ సహన సముద్రాన్ని.. ఒక చెంపను కొట్టకుండానే రెండు చెంపలూ వాయిస్తున్న ఈ తరానికి, వారి ఆవేశం, అసహనం, అశాంతులను అచేతనంగా అణిచివేసి ఆర్తి, ఆలోచన, ఆహ్లాదం వైపు మళ్లించటానికి మీరు మళ్లీ రావాలి.
భగవద్గీతను రోజూ చదువుతూ ఆచరించే కర్మ యోగిగా, శాస్త్రీయ సంగీతం ఆస్వాదిస్తూ పరమాత్మను అంతరాత్మలో నింపుకున్న మీ ఆచరణాత్మక ఆధ్యాత్మికతను.. భగవద్గీత అంటే ఎలా గీస్తారు.. అని అడిగేస్తున్న ఈ తరానికి.. అవి తరతరాలుగా మన సాంస్కృతిక ప్రవాహంలో జీవన గీతంగా మారిన దైనందిన జీవన తరంగం అని స్స్ఫూర్తితో వివరించటానికి మీరు మళ్లీ రావాలి.
ఓ మహర్షీ.. ఓ మహాత్మా..
మీరు మళ్లీ రావాలి..
మాకోసం రావాలి..
మా బిడ్డలకు వారి బిడ్డలకు దిక్సూచిలా ఉండేందుకు, మీ నైతిక మార్గదర్శనం ఇచ్చేందుకు మీరు మళ్లీ రావాలి!