కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు పశ్చిమ బెంగాల్ స్పెషల్ కోర్టు సమన్లు జారీచేసింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీ పరువుకు నష్టం కలిగించేలా అమిత్ షా వ్యాఖ్యలు చేశారని దాఖలైన కేసులో ఈ సమన్లు ఇచ్చింది. ఈ మేరకు ఈ నెల 22న విచారణకు హాజరు కావాలని అమిత్ షాను ఆదేశించింది. వ్యక్తిగతంగా లేదా ఆయన తరపు న్యాయవాది హాజరైనా పరవాలేదని సూచించింది.
కాగా, అభిషేక్ బెనర్జీపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఈనాటివి కావు. 2018 ఆగస్టు 11న కోల్‌కతాలో నిర్వహించిన ర్యాలీలో అభిషేక్ బెనర్జీకి నష్టం కలిగించేలా అమిత్ షా వ్యాఖ్యలు చేశారని ఆయన తరపు న్యాయవాది చెప్పారు. ప్రస్తుతం అమిత్ షా పశ్చిమ బెంగాల్ పర్యటనలోనే ఉన్నారు. ఏప్రిల్ లేదా మే నెలల్లో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.దీంతో బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ మధ్య ఇటీవల డైలాగ్ వార్ కొనసాగుతుంది.