ఖమ్మం సభను బీఆర్ఎస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. చరిత్రలో నిలిచిపోయేలా దీన్ని నిర్వహించాలని పక్కా ప్లాన్ తో ముందుకు వెళ్తోంది. మంత్రి హరీష్ రావు అన్నీ దగ్గరుండి చూసుకుంటున్నారు. సభా వేదిక దగ్గర మీడియాతో మాట్లాడిన ఆయన.. ఈ సభకు నాలుగు జాతీయ పార్టీలు పాల్గొంటున్నాయని తెలిపారు. ఈ మధ్యకాలంలో ఇన్ని జాతీయ పార్టీలను, ఇంతమంది నాయకులను వేదికపై తీసుకువచ్చిన సందర్భం ఏదీ లేదని చెప్పారు.
ఆప్ వ్యవస్థాపకులు కేజ్రీవాల్, ఎస్పీ అధ్యక్షులు అఖిలేశ్ యాదవ్, సీపీఐ అధ్యక్షులు డీ రాజా, సీపీఎం తరఫున ముఖ్యమంత్రి పినరయి విజయన్ పాల్గొంటున్నారని.. నాలుగు జాతీయ పార్టీలను ఒక వేదికపైకి తీసుకొస్తుండడం కేసీఆర్ తొలి విజయంగా చెప్పారు హరీష్ రావు. దాదాపు వంద ఎకరాల్లో ఖమ్మం సభ ఏర్పాట్లు చేశారు. పార్కింగ్ కోసం ప్రత్యేకంగా 400 ఎకరాలకు పైగా ఉపయోగిస్తున్నారు.
మరోవైపు తెలంగాణకు వస్తున్న జాతీయ నేతలకు పసందైన వంటకాలు రుచి చూపించనున్నారు కేసీఆర్. తెలంగాణ సంప్రదాయ వంటలను అతిథులకు వడ్డించనున్నారు. 17 రకాల నాన్ వెజ్, 21 రకాల వెజ్ వంటలు వారికోసం సిద్ధం చేస్తున్నారు.
ఇటు నలుగురు సీఎంలు, ఇరత నేతల రాక సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. మొత్తం 4,202 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. పది మంది అదనపు ఎస్పీలు, 39 మంది ఏసీపీలు, 139 మంది సీఐలు, 409 మంది ఎస్సైలు, 530 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 1,941 మంది కానిస్టేబుళ్లు, 1,005 మంది హోంగార్డులు, 120 మంది స్పెషల్ పార్టీ పోలీసులు విధుల్లో పాల్గొంటున్నారు.