అసోం ఫారెస్ట్ అధికారుల ఆలోచన అదుర్స్
మనం చాలా సార్లు గ్రామాల మీదకు ఏనుగులు వచ్చిన ఘటనల గురించి వింటూనే ఉన్నాము. చాలా సందర్భాల్లో ఆహారం కోసం అవి పంటపొలాల్లోకి వెళ్లడం, అక్కడ పంట మొత్తాన్ని నాశనం చేయడం గురించి వింటూనే ఉన్నాము. ఇక వాటిని అదుపు చేసేందుకు రైతుల పడే తంటాలు అన్నీ ఇన్నీ కాదు.
ఇలాంటి సమస్యే అసోంలోని నాగావ్ జిల్లా రైతులకు ఎదురైంది. దీంతో ఈ సమస్యలకు చెక్ పెట్టేందుకు అసోం ఫారెస్ట్ అధికారులు నూతన ఆలోచన చేశారు. ఆహారం కోసం గ్రామాల్లోకి ఏనుగులు రాకుండా ఉండేలా ప్రత్యేక ఫుడ్ జోన్ ఏర్పాటు చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇప్పుడు ఆ ఫుడ్ జోన్ ఆలోచనకు పెద్ద ఎత్తున ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
గ్రామాల్లోకి ఏనుగులు ప్రవేశించకుండా ఉండేందుకు వాటి కోసం రైతులతో కలిసి ఓ ప్రత్యేకమైన ఫుడ్ జోన్ ఏర్పాటు చేయాలని నాగావ్ జిల్లా అటవీ అధికారులు ఆలోచన చేశారు. అనుకున్నదే తడవుగా బాముని, రోంగ్ తంగ్, కార్బీ ఆంగ్ లాంగ్ అటవీ ప్రాంతాల్లోని బీడు భూముల్లో ఏనుగుల కోసం గడ్డిని, వాటికి కావాల్సిన ఆహారాన్ని పండించారు. దీంతో ఆయా గ్రామాలకు ఏనుగుల బెడద చాలా వరకు తగ్గిపోయింది.
దీనిపై ఫారెస్ట్ అధికారులు మాట్లాడుతూ.. ‘ సాధారణంగా ఆహారం కోసం వెతుకుతూ గ్రామాల్లోకి ఏనుగులు ఏ ప్రదేశాల నుంచి వచ్చే అవకాశం ఉందో ఆయా ప్రదేశాల దగ్గర ప్రత్యేకమైన ఫుడ్ జోన్లు ఏర్పాట్లు చేశాము. ఈ ఏర్పాట్లతో గ్రామాల్లోకి ప్రవేశించే ఏనుగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మేము చేసిన ప్రయత్నం సత్ఫలితాలు ఇస్తుండటం ఆనందాన్ని కలిగిస్తోంది అని అన్నారు”.