తమ అభిమాన హీరోల కోసం ఏమైనా చేస్తారు కొందరు. హీరోపై తమకున్నా అభిమానాన్ని చాటుకుంటూ వినూత్న ప్రయత్నాలు చేస్తుంటారు. గతంలో మనం ఇలాంటివి చాలానే చూశాం. ఇదే తరహాలో తాజాగా ఓ యువకుడు రామ్‌చరణ్‌పై తనకున్నా అభిమానాన్ని వినూత్న పద్ధతిలో చాటుకున్నాడు. రామ్‌చరణ్‌కు పుట్టిన రోజు బహుమతిగా దాన్ని అందించాలని ఆరాటపడుతున్నాడు.
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం ఆరగిద్ద గ్రామానికి చెందిన జయరాజ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌కు వీరాభిమాని. ఈ నెల 27వ తేదీన రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా తన అభిమాన హీరో కోసం ఏదైనా ప్రత్యేకంగా చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా గ్రామంలో అర ఎకరం పొలం కౌలుకు తీసుకుని రామ్ చరణ్ రూపం ఏర్పడే విధంగా వరి నాటు వేశాడు. ఎంతో జాగ్రత్తగా కష్టపడి ఆ చిత్రాన్ని కాపాడుకున్నామని ఎప్పటికప్పుడు ఎరువులు, లేజర్ వేస్తూ ఇంతవరకు తెచ్చామన్నారు.
ఈనెల 27న రామ్ చరణ్ జన్మదినం సందర్భంగా శిల్పకళా వేదికలో దీన్ని ఆవిష్కరిస్తామని చెప్పారు. పచ్చని పంట పొలాల మద్య వేసిన రామ్ చరణ్ చిత్రం చూపరులకు కనువిందు చేస్తుంది. జయరాజ్ గతంలో కూడా రామ్‌చరణ్ కోసం సుమారు రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టి హైదరాబాద్‌లోని రామ్ చరణ్ కలిసి తన అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువసేన నాయకుడు స్వామి గ్రామాన్ని సందర్శించి.. జయరాజు తన పొలంలో ఏర్పాటు చేసిన రామ్ చరణ్ ఫోటో చూసి ప్రశంసించారు. రామ్ చరణ్ పుట్టినరోజు నాడు హైదరాబాద్‌లో జరిగే వేడుకలకు జయరాజుతో పాటు గ్రామ యువకులకు రామ్ చరణ్ చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయనున్నట్లు స్వామి నాయుడు తెలిపారు.